ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలతోపాటు కోర్టు తీర్పుల అమలునూ ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ అన్నారు. ఈ నేపథ్యంలో హామీల అమలు, సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం యూనియన్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే 'పోరుయాత్ర'ను మండల కేంద్రమైన ఫిరంగిపురంలో సుబ్బరావమ్మ బుధవారం ప్రారంభించారు. అనంతరం మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు మండలాల్లో యాత్ర పర్యటించింది. ఫిరంగిపురంలో సిడిపిఒ కార్యాలయానికి ప్రదర్శినగా వెళ్లి వినతిపత్రం ఇవ్వగా మేడికొండూరు మండలంలోని 14 గ్రామాల అంగన్వాడీలు తమ సమస్యలపై వినతిపత్రాలను పోరుయాత్ర బృందానికి ఇచ్చారు. ఆయా మండలాల్లో నిర్వహించిన సభల్లో సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు విధుల్లో అనేక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారని, వారికి పనిభారం తగ్గించాలని కోరారు. హెల్పర్ల ప్రమోషన్లలో రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని ప్రధాన సమస్యలైన వంట పాత్రలు, గ్యాస్, ఫర్నిచర్, విద్యుత్, తాగునీటి సదుపాయాలను సత్వరమే కల్పించాలని కోరారు. ఫ్రీ స్కూల్ బలోపేతం చేయాలని అన్నారు. యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజీ, ప్రధాన కార్యదర్శి దీప్తి మనోజ మాట్లాడుతూ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలన్నారు. 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ఐక్యంగా పోరాడాలని, పోరాటాలతోనే ఏ ప్రభుత్వమైనా దిగొస్తుందని చెప్పారు. కార్యక్రమాల్లో నాయకులు టి.రాధా, కె.విజయకుమారి, శ్యామల, ఎవియన్ కుమారి, పి.ధనలక్ష్మి, రజిని, ఎస్‌ఎం వలి, ఎం.ధనలక్ష్మి, పావని, పి.విజయకుమారి, వై.గాంధీ రామ్మోహనరావు, కె.పూర్ణచంద్రరావు, సిహెచ్.భాస్కరరావు, ఎం.రవి, ఎం.భాగ్యరాజు, విజయ, స్వర్ణలత, కరీమూన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా ఫిరంగిపురంలో యూనియన్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పి.రజిని, కార్యదర్శి కె.విజయకుమారి, గౌరవాధ్యక్షులుగా ఎస్.ఎం.వలి, పది మంది సభ్యులు ఎన్నికయ్యారు.










