Nov 20,2022 22:09

 వాటర్‌గ్రిడ్‌ పథకంపై ఆర్భాటపు ప్రకటనలు
 ఫిషింగ్‌ హార్బర్‌ కల సాకారమయ్యేదెన్నడో
 తీర ప్రాంతానికి ఫుడ్‌ పార్కు తరలింపు మరిచారే
 గోదావరిపై వంతెన నిర్మాణం మాటేమిటో
 నేడు నరసాపురంలో సిఎం జగన్‌ పర్యటన
ప్రజాశక్తి - భీమవరం

             సిఎం జగన్‌ సోమవారం నరసాపురంలో పర్యటించనున్నారు. సుమారు రూ.రెండు వేల కోట్లకుపైగా విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. నూతనంగా భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి సిఎం ఈ జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావాసులు సిఎం జగన్‌ తమ సమస్యలపై స్పందించాలని కోరుతున్నారు.
నాడు ప్రతిపక్ష నేతగా జగన్‌ పాదయాత్ర ప్రస్తుత పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధాన పట్టణాల మీదుగా సాగింది. ఆ సందర్భంగా పలు హామీలు ఇచ్చారు. అలాగే ఎన్నికల ప్రచారంలోనూ స్పష్టమైన హామీలు మరోసారి గుప్పించారు. అయితే వాటిలో కొన్నింటికి సంబంధించి సోమవారం శంకుస్థాపనలు చేయనుండగా మిగిలిన వాటి సంగతేంటని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా డెల్టా వాసుల ప్రాణాలను హరిస్తున్న కలుషిత నీటి నుంచి కాపాడి అందరికీ రక్షిత నీరు అందించేలా వాటర్‌గ్రిడ్‌ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకొచ్చాక అప్పటి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు కూడా వేల కోట్లు ఈ పథకానికి కేటాయించినట్లు ప్రకటనలు గుప్పించారు. అయితే అవేమీ గడప దాటలేదు. దీంతో శంకుస్థాపన స్థాయి దాటని పరిస్థితి ఉంది. మరోసారి తాగునీటి సరఫరాకు పథకం అంటూ శంకుస్థాపన చేయనున్నారు. ఇదైనా ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందోనని అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలోనూ, ఈ ప్రభుత్వ హయాంలోనూ శంకుస్థాపనల పర్వం సాగుతూనే ఉంది. ఇక కొల్లేరు రెగ్యులేటర్ల నిర్మాణం అనేది ఈనాటిది కాదు. అందువల్ల వీటన్నింటికీ శంకుస్థాపన చేయడం సంతోషకరమే అయినా ఎప్పటికి కార్యరూపం దాల్చుతున్నాయనేది ప్రశ్నార్థకమేనని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక మిగిలిన హామీల మాటేమిటని ఆయా ప్రాంతాల వాసులు ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో తుందుర్రు ప్రాంతంలో నిర్మాణం చేపట్టిన మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా జనం పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. ప్రభుత్వం అదే రీతిలో నిర్బంధకాండకు పాల్పడింది. అక్రమ కేసులు బనాయించి రోజుల తరబడి జైళ్లలో నిర్బంధించింది. ఆ సందర్భంగా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ ఈ ప్రాంత పర్యటన సందర్భంగా తాము అధికారంలోకి రాగానే ఫుడ్‌పార్క్‌ను తీర ప్రాంతానికి తరలిస్తామని ప్రకటించారు. జగన్‌ అధికారం చేపట్టి మూడున్నరేళ్లయింది. నాటి నుంచి నేటి వరకూ ఆ ఫ్యాక్టరీ తరలింపు ఊసే లేదు. ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన నేతలు, ప్రజలు మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరి ఈ హామీపై జగన్‌ నరసాపురం పర్యటనలో పెదవి విప్పుతారో లేదో వేచిచూడాలి.
ఇక నరసాపురం పట్టణాభివృద్ధిలో వెనుకబడటానికి ప్రధాన కారణం గోదావరిపై వంతెన నిర్మాణం జరగకపోవడమేనని ఆ ప్రాంత ప్రజలు, వ్యాపారవేత్తలు తరచూ చెబుతుంటారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి ఎన్‌టిఆర్‌ ప్రభుత్వ హయాం నుంచి శంకుస్థాపనలైతే చేస్తున్నారుగాని పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇక్కడ గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటంతో వంతెన డిజైన్‌లో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. శంకుస్థాపన చేస్తున్న నేతలు తర్వాత ఈ కారణాన్ని సాకుగా చూపి పనులను అటకెక్కిస్తున్నారు. మరి సిఎం జగన్‌ ఈ పర్యటనలో ఈ వంతెన నిర్మాణంపై ఏమైనా స్పష్టతనిస్తారో లేదో వేచిచూడాలి.
కొల్లేరు కాంటూరు కుదింపు అంశం అలానే పెండింగులో ఉంది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లోని పేదలు ఇప్పటికీ ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే కాళీపట్నం జమిందారీ భూముల అంశం, ఆక్వా కాలుష్యం, అధ్వానంగా తయారైన రోడ్లు, వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటు, నూతన జిల్లా కేంద్రంలో భవనాల నిర్మాణం, వసతుల కల్పన తదితర సమస్యలు సిఎం జగన్‌కు సాదర స్వాగతం పలుకుతున్నాయి. వీటిపై ఆయన ఏమైనా స్పందిస్తారా లేక కేవలం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకే పరిమితమవుతారా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.