Sep 23,2023 20:24

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజల చెవిలో పువ్వు పెట్టారని టిడిపి ఇన్‌ఛార్జీ మీనాక్షి నాయుడు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి ఆధ్వర్యంలో నుదుటిపై తిలకం దిద్దుకొని, గోవింద నామస్మరణ చేస్తూ శనివారం ఆదోనిలోని ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా ఏకమవుతున్నారని తెలిపారు. పరిపాలన సంస్కరణలతో ప్రయోజనం పొందిన వారు వేలాదిగా ముందుకు వస్తున్నారని చెప్పారు. చంద్రబాబును అక్రమంగా జైలుకు పంపి జగన్‌ తన గొయ్యి తానే తవ్వుక్కున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ఆరు జోన్లలో శిక్షణ పొందిన సుమారు రెండు లక్షల మంది ఉన్నత ఉద్యోగాలు సాధించిన వారు రోడ్లపైకి వస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ చేసే కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రం అధోగతి పాలవుతోందని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటిలోనూ ఆయన కడిగిన ముత్యంలా బయటకొస్తారని ధీమా వ్యక్తం చేశారు. స్వకుళ సాలె సోదరులు సాకరే గోపాలకృష్ణ, సాకరే ఈరన్న, సాకరే లక్ష్మన్న, సాకరే నాగరాజు, పిఎస్‌.మహిపాల్‌, ఆర్‌.శివకుమార్‌, యువరాజ్‌, సర్దే హరికృష్ణ ఆదోనిలోని ఎన్‌టిఆర్‌ విగ్రహం దగ్గర సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు కూర్చున్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు ఉమాపతి నాయుడు, కర్నూలు జిల్లా పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి భూపాల్‌ చౌదరి, టిడిపి నాయకులు సాకరే మారుతి, గిడ్డు శంకర్‌, బుద్ధారెడ్డి, మారుతి నాయుడు, నెట్టేకల్‌, ఈరన్న, దొడ్డనగేరి శివప్ప, చాగి మల్లికార్జున, ఆరెకల్‌ రామకృష్ణ, రంగస్వామి నాయుడు, బసాపురం రామస్వామి, బసాపురం వెంకటేష్‌, కృష్ణారెడ్డి, మాబాష ఉన్నారు. అలాగే ఆదోనిలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు నల్లకండువా ధరించి 10వ రోజూ దీక్షలకు కూర్చున్నారు. టిడిపి సీనియర్‌ నాయకులు, వ్యవసాయ మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ మదిరే భాస్కర్‌ రెడ్డి, మాన్వి దేవేంద్రప్ప, సౌదీ రావుఫ్‌ మాట్లాడారు. రాష్ట్రానికి పట్టిన శని అంతమయ్యే రోజులు దగ్గర్లోనే ఉందన్నారు. టిడిపి నాయకులు సాంబగల్‌ ఫక్రుద్దీన్‌, సోమశేఖర్‌ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు రామచంద్ర, మల్లికార్జున, శ్రీనివాసులు, మల్లేశ్వరప్ప, మద్దికెర రామకృష్ణ, మైనార్టీ నాయకులు ఎమ్‌డి.హుస్సేన్‌, నారాయణపురం షాషావలీ, కారుమంచి, ఇస్మాయిల్‌ బాష, సలకలకొండ శీను, రామకృష్ణ, గోవింద, నాగరాజు, తిమ్మప్ప, శేకన్న, వీరేష్‌ పాల్గొన్నారు.