ప్రజాశక్తి-గుంటూరు : విఆర్‌ఎలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే 25న చలో విజయవాడ నిర్వహిస్తామని, అవసరమైతే సిఎం ఇంటిని ముట్టడిస్తామని ఎపి విఆర్‌ఎల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ అన్నారు. ఎపి గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం (సిఐటియు) ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన రెండ్రోజుల ధర్నాలో భాగంగా మంగళ వారం బాలకాశి ముఖ్యవక్తగా హాజర య్యారు. ధర్నా అనంతరం డిఆర్‌ఓ కె.చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందచే శారు. ధర్నాకు గుంటూరు జిల్లా విఆర్‌ఎల అధ్యక్షులు వి.బాజీబాబు అధ్యక్షత వహించారు. బాలకాశీ మాట్లాడుతూ విఆర్‌ఎల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, నామినీల సమస్య పరిష్కరించాలని, ప్రమోషన్లు కల్పించాలని ఈ ప్రభుత్వాన్ని కోరినా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదన్నారు. 2018లో జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో విఆర్‌ఎల ధర్నా టెంట్ వద్దకు వచ్చి వైసిపి ప్రభుత్వం రాగానే వేతనాలు పెంచుతామని, ఇతర సమస్యలు పరిష్కరి స్తామని వాగ్దానం చేసి, అధికారంలోకి రాగానే విస్మరించారని విమర్శించారు. హామీలు అమలు చేయకపోగా కేవలం రూ.10500 వేతనం పొందుతున్న వారి నుండి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.300ల డిఎను కూడా రికవరీ చేయటం అన్యాయమన్నారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం విఆర్‌ఎ వ్యవ స్థను రద్దు చేసి, అర్హతను బట్టి విఆర్‌ఎలను వివిధ శాఖల్లో విలీనం చేసిందని, ఏపీలోనూ అలా చేయటానికి సమస్య ఏమి టని ప్రశ్నించారు. విఆర్‌ఎలు ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల వారేనని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం దుర్మార్గమని అన్నారు. సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బి.లక్ష్మణరావు మాట్లాడు తూ ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఉన్నా వీఆర్‌ఏలకు ఏమాత్రం హక్కులు సాధించు కున్నా అది కేవలం పోరాటం ద్వారానే సాధ్యమైందన్నారు. జగన్ ప్రభుత్వం అత్యంత నిర్బంధంగా, సమస్యలు పరిష్కరి ంచడంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు. ధర్నాలో ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.శివాజీ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజీ, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, రాజధాని ప్రాంతీయ కార్యదర్శి ఎం.భాగ్యరాజు, ఫిరంగిపురం మండల కార్యదర్శి ఎస్.యం.వలి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె.సంగయ్య, ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా, ఉపాధ్యక్షులు జె.రాజేష్, సాంబశివరావు పాల్గొన్నారు.










