ప్రజాశక్తి : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేలి రవికుమార్ డిమాండ్ చేశారు. పట్టణాలు, నగరాలు పరిశుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పరిరక్షిస్తున్న దళిత, గిరిజన, బలహీనవర్గాలకు చెందిన మున్సి పల్ పారిశుధ్య, ఇంజినీరింగ్ కార్మికులకు జగన్ హామీ మేరకు సమానపనికి సమాన వేతనం, ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 27 28వ తేదీలలో తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల సుందరీకరణ, అమత పట్టణాలు, స్వచ్ఛభారత్ వంటి ఆకర్షణీయమైన పేర్లు పెట్టి కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నాయి తప్ప మున్సిపల్, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను గాలికొదిలేస్తున్నాయని పేర్కొన్నారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాలు గడవక అవస్థలు పడుతున్నా పట్టించుకునే దిక్కు లేదని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కాంట్రాక్టు-అవుట్ సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామన్న వాగ్ధానాలను నాలుగేళ్లుగా తుంగలో తొక్కారన్నారు. హామీలను అమలు చేయాలని కోరుతుంటే పోలీసు నిర్బంధాన్ని ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. పారిశుధ్య కార్మికులకు ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న వాగ్ధానం అటకెక్కించారని పేర్కొన్నారు. 2022 జూలైలో జరిగిన సమ్మె సందర్భంగా ఇంజినీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న వాగ్ధానం నేటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు. దళారీ వ్యవస్థకు తమ పాలనలో స్థానం లేదన్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో క్లాప్ ఆటోలను దళారీలకు అప్పగించి క్లాప్ డ్రైవర్లకు జిఒ 07 ప్రకారం రూ 18,500 జీతం ఇవ్వకుండా కేవలం రూ.10 నుండి రూ.12 వేలు మాత్రమే ఇచ్చి శ్రమ దోపిడి చేస్తున్నారని విమర్శించారు. పర్మినెంట్ సిబ్బందికి సిపిఎస్ రద్దు, ఒపిఎస్ అమలు వాగ్ధానానికి తూట్లు పొడిచారని తెలిపారు. సరెండర్ లీవులు, డిఎ బకాయీల దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలపై స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సి.హెచ్ ఓబయ్య, టి.తిరుపలు, కె.తిరుపాలు, మధు, ప్రసాద్, లక్ష్మీ దేవి పాల్గొన్నారు.