Aug 18,2023 00:49

ప్రజాశక్తి - గుంటూరు జిల్లా విలేకర్లు : అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయా రమాదేవి అన్నారు. అంగనవాడీల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన పోరు యాత్ర గురువారం మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర మండలాల్లో పర్యటించింది. ఆయా మండలాల్లో యాత్రకు అంగన్వాడీలు ఘన స్వాగతం పలకడంతోపాటు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువగా జీతాలు ఇస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా హామీ ఇచ్చారని, ఇప్పుడు పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అంగన్వాడీలకు పని భారం తగ్గించాలని, హెల్పర్ల ప్రమోషన్‌ లో రాజకీయం జోక్యాన్ని నివారించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు అమ్మఒడి, యూనిఫామ్‌ ఇవ్వాలని, ప్రీ స్కూల్‌ను బలోపేతం చేయాలని అన్నారు. అన్ని సెంటర్లను వంట పాత్రలు, ఫర్నిచర్‌, విద్యుత్‌, గ్యాస్‌, తాగునీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. అంగన్వాడీలకూ సంక్షేమ పథకాల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బాలింతలు, గర్భిణులకు సేవ చేస్తున్న ఐసిడిఎస్‌ను నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నాయని మండిపడ్డారు. నూతన విద్యా విధానం విద్యా రంగాన్ని బలహీనపరుస్తుందని, అయితే దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం దుర్మార్గమని అన్నారు. 12 గంటల పాటు బానిసలుగా పని చేస్తున్న అంగన్‌వాడీలకు సరైన వేతనాలు ఇవ్వడంలేదని, అంగన్‌వాడీలు అప్పులపాలవుతూ సెంటర్లు నడుపుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే, ఎంపిలకు అందిస్తున్న సౌకర్యాల్లో పది శాతాన్ని అంగన్‌వాడీలకు వర్తింపజేసినా వారి జీవితాలు బాగుపడతాయన్నారు. గతంలో పసుపు, కుంకుమ ప్రస్తుతం నవరత్నాలు పేరుతో అంగన్‌వాడీల నిధులు పక్కదారి పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు వై.నేతాజి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాడిటీ ఇవ్వాలని కోరారు. పనిచేయని ఫోన్లు ఇచ్చి మానసికంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. లబ్ధిదారులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందజేయాలని కోరారు. అంగన్వాడీల పాత బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ సమస్యలపై అంగన్వాడీలంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో నాయకులు వి.దుర్గారావు, సబిత, టి.రాధ, కె.శ్యామల, కిరణ్మయి, ఎబిఎన్‌ కుమారి, ఎస్‌ఎస్‌ చంగయ్య, వై.కమలాకర్‌, హేమలత, జయలక్ష్మి, కళ్యాణి, అన్నపూర్ణ, జె.బాలరాజు, వై.బ్రహ్మేశ్వరరావు, జయశ్రీ, పావని, నిర్మల జ్యోతి, ఎం.శివసాంబిరెడ్డి, కె.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.