Jan 17,2023 22:53

రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు

ప్రజాశక్తి -అనకాపల్లి
ఢిల్లీలో రైతు ఉద్యమం సందర్భంగా మోడీ ప్రభుత్వం దొగిచ్చి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని రైతు, కార్మిక, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. స్థానిక దొడ్డి రామనాయుడు కార్మిక కర్షక నిలయంలో కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష రైతు సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఏడాది పాటు ఢిలీలో రైతాంగం సాగించిన ఉద్యమానికి కేంద్రం మెడలు వంచక తప్పలేదని పేర్కొన్నారు. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఆ చట్టాలను రద్దు చేయడంతో పాటు, పంటల గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని, రైతు సంఘాలతో చర్చించకుండా విద్యుత్తు సంస్కరణల బిల్లు పార్లమెంటులో పెట్టబోమని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కాని ఆ హామీలు నేటికీ నెరవేరలేదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను నెరవేర్చని కారణంగా ఏఐకేఎస్‌ పిలుపుమేరకు ఈనెల 26న రైతు రక్షణ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిని విజయవంతం చేయాలని కోరారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఎత్తివేత, పేద రైతులకు వ్యవసాయ రాయితీలు ఎత్తివేత, విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటుపరం చేసేందుకు అప్రాజస్వామికంగా పార్లమెంటులో కేంద్రం బిల్లు పెట్టడం దారుణమన్నారు. దీనిపై గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రెండో దశ పోరాటానికి సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. రైతాంగ కోర్కెలపై సంతకాల సేకరణ, కరపత్ర ప్రచారం, ఆటోల ద్వారా ప్రచారం, ప్లకార్డుల ప్రదర్శన, నెహ్రూ చౌక్‌ సెంటర్లో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కర్రి అప్పారావు, ఎం అప్పలరాజు, రైతు నాయకులు వైఎన్‌ భద్రం, కోరిబిల్లి శంకర్రావు, అఖిలభారత గ్రామీణ కార్మిక సంఘం నాయకులు పిఎస్‌ అజరు కుమార్‌, చేతి వృత్తి సంఘాల నాయకులు గంట శ్రీరామ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు కాళ్ళ ఏడుకొండలు, సిఐటియు నాయకులు వివి శ్రీనివాసరావు, పెంటకోట శ్రీనివాసరావు, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘం నాయకులు బి ఉమామహేశ్వరరావు, ఎం నాగేశ్వరరావు, ఎన్‌పిఆర్‌డి నాయకులు. బి నూక అప్పారావు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.