ప్రజాశక్తి-గుంటూరు : మున్సిపల్ కార్మికులకు సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ఉద్యమిస్తామని ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామమేశ్వరరావు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన జాతా గురువారం గుంటూరు చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక చుట్టుగుంట సెంటర్‌లో వివిధ యూనియన్ల నాయకులు, మున్సిపల్ కార్మికులు స్వాగతం పలికారు. అనంతరం జిఎంసి ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన సభలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేసే పని ఎవరూ చేయలేరని, వారికి లక్ష రూపాయలు జీతం ఇచ్చినా తక్కువే అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారని, ఇవి మాటలకే పరిమితమా అని ప్రశ్నించారు. రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికులకు పిఆర్‌సి అమలు చేశారని, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అముల చేయకుండా మోసం చేసిందన్నారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. గత నెల 31వ తేది నుండి మున్సిపల్ కార్మికుల రాష్ట్ర జాతా జరుగుతుంటే టిడిపి కానీ, జనసేన కానీ కనీసం స్పందించలేదని అన్నారు. ఈ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రచార జాతా అనంతరం సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి టి.నూకరాజు, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు ప్రసంగించారు. కార్యక్రమంలో సిఐటియు గుంటూరు నగర తూర్పు కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాసరావు, నాయకులు ఆది నికల్సన్, షేక్ ఖాసీంవలి, కె.నళినీకాంత్, గోవిందు, గోపి, జె.చినవెంకటస్వామి, మున్సిపల్ యూనియన్ నాయకులు పి.శ్రీనివాసరావు, పి.పూర్ణచంద్రరావు, షేక్ రబ్బాని, కాటం రాజు, ఎ.కోటేశ్వరరావు, కె.శౌరమ్మ, సామ్రాజ్యం, జి.ప్రసాదరావు పాల్గొన్నారు.










