
ప్రజాశక్తి - బలిజిపేట : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ తనను తాను నిరూపించుకుంటున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని వెంగాపురంలో మంగళవారం నిర్వహించిన జగన్ ఎందుకు రావాలి అనే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట కోసం ప్రతి ఒక్కరికీ, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషించారని అన్నారు. సచివాలయాల పరిధిలో ప్రభుత్వం ఇంతవరకు నవరత్నాల అమలు విధానం బోర్డులను ఏర్పాటు చేశామన్నారు. అర్హులైన ప్రజలు సంక్షేమ పథకాలు పొందారో, లేదో ఈ బోర్డుల ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. పార్టీ, కుల, మత వర్గ బేధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్ర అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న విషయాలను గమనంలో ఉంచుకొని మళ్లీ జగన్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి సభ్యులు మురళి, సర్పంచ్ పాలవలస మురళి, తదితరులు పాల్గొన్నారు.