Aug 27,2023 22:17

చింతలపూడి నియోజవర్గంలో లోకేష్‌ పాదయాత్రకు ఘనస్వాగతం
దారిపొడవునా జన ప్రవాహం
ప్రజా సమస్యలపై వినతుల స్వీకరణ
విద్యుత్‌ భారాలు, పెంచిన పన్నులు తగ్గిస్తామని హామీ
మెరుగైన ఇసుక పాలసీ తెస్తామని భరోసా
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి/ముసునూరు/చింతలపూడి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర మూడోరోజు ఆదివారం చింతలపూడి నియోజకవర్గంలో ఉత్సాహభరితంగా సాగింది. ఈ సందర్భంగా లోకేష్‌ ప్రజాసమస్యలపై హామీలిస్తూ, వినతులు స్వీకరిస్తూ ముందుకుసాగారు. శనివారంరాత్రి ముసునూరు మండలం వలసపల్లిలో బసచేసిన లోకేష్‌ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వలసపల్లి గ్రామస్తులు పలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేస్తే తమ గ్రామానికి తాగు, సాగునీరు వస్తాయని, మెట్ట భూములు సస్యశ్యామలమవుతాయన్నారు. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అసంపూర్తిగా ఉందని, ఎస్‌సి, బిసి, ఒసి ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని, బిసి, ఒసిలకు శ్మశాసనవాటిక లేదని, అర్హత ఉన్న వితంతువులకు నెలల తరబడి పెన్షన్‌ రావడం లేదని, డంపింగ్‌ యార్డ్‌లేదని, తమ్మలేరుతో గ్రామంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ సిఎం జగన్‌ పానలో ప్రాజెక్టులకు గ్రీజు పెట్టే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. పంచాయతీ నిధులను దారిమళ్లించి నిర్వీర్యం చేశారన్నారు. తమ్మిలేరుపై సైడ్‌వాల్స్‌ నిర్మించి ముంపు బెడద తప్పిస్తామన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరువంటి మౌలికసదుపాయాలకు పెద్దపీట వేస్తామన్నారు. ముసునూరు మండలం నుంచి చింతలపూడి నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం వలసపల్లి అడ్డరోడ్డు వద్ద లోకేష్‌కు జిల్లా, నియోజకవర్గ నాయకులు పెద్దఎత్తున గజమాలతో స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చి స్వాగతించారు. రోడ్లను జనంతో కిక్కిరిసిపోయాయి. చింతలపూడి నియోజకవర్గంలోకి పాదయాత్ర చేరుకోగానే ఉమ్మడి కృష్ణా జిల్లానేతలు వీడ్కోలు పలికారు. ధర్మాజీగూడెం శివారులో లోకేష్‌కు ఘనస్వాగతం లభించింది. పార్టీ కేడర్‌కు ఏ కష్టమొచ్చినా వెన్నంటే ఉంటామని, భరోసా ఇచ్చారు. ఇదేస్ఫూర్తితో వచ్చే ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని పార్టీ శ్రేణులకు పిలుపుని చ్చారు. ధర్మాజీగూడెంలో లోకేష్‌ మాట్లాడుతూ కుడిచేత్తో 10 రూపాయల ఇచ్చి, ఎడమచేత్తో రూ.వంద లాగేయడం జగన్‌కు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేయడం చేతగాని జగన్‌ అడ్డగోలు పన్నులతో పెట్రోలు, డీజిల్‌ ధరల్లో మాత్రం ఎపిని దేశంలోనే నెం.1 స్థానంలో నిలిపారన్నారు. జగన్‌ బాదుడు దెబ్బకు జనం విలవిల్లాడుతున్నారన్నారు. పన్నుల భారాలతో ప్రజల నడ్డివిరుస్తున్న అరాచకపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కలగాలంటే సైకోపోవాలి... సైకిల్‌ రావాలి అంటూ పిలుపునిచ్చారు.
పాదయాత్రలో ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, మాజీమంత్రి పీతల సుజాత, ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, నియోజకవర్గ నాయకులు రోషన్‌కుమార్‌ పలువురు నాయకులు ఉన్నారు.