ఉపాధ్యాయ బదిలీలను తక్షణమే చేపట్టాలి
విద్యాశాఖపై అవగాహన లేని మంత్రి బొత్స రాజీనామా చేయాలి
టిడిపి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్
ప్రజాశక్తి -అనకాపల్లి : విద్యాశాఖపై అవగాహన లేని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తక్షణమే రాజీనామా చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ బదిలీలను ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని కోరారు. ఆదివారం స్థానిక రింగ్‌రోడ్డు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, విద్యా సంవత్సరం ప్రారంభంలో బదిలీలు ఉంటాయని చెప్పిన మంత్రి బొత్స, ఇప్పటివరకు ఎందుకు చేపట్టలేదో చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, ఉద్యోగులు, ఉపాధ్యాయులను మభ్యపెట్టి ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు అసాధ్యమంటూ చేతులెత్తేయడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం సమంజసం కాదన్నారు. విపక్షంలో ఉన్నపుడు ఉద్యోగుల పెండింగ్ డిఎలపై హంగమా చేసిన సిఎం జగన్, ఇపుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాటికోసం ఉద్యమిస్తుంటే పోలీసులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు సిఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు కోరితే, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వాటికి గొంతెమ్మ కోరికలంటూ ఎద్దేవా చేయడం బాధాకరమన్నారు. ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రి, మంత్రులను గతంలో ఏ ప్రభుత్వంలో లేదని, దీనిపై తగిన సమయంలో ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ నాయకులు ధనాల విష్ణు చౌదరి, కొణతాల వెంకటరావు పాల్గొన్నారు.










