ప్రజాశక్తి-కాకినాడ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎపి ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆశా వర్కర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా రూ.26 వేల కనీస వేతనం పెంచాలని, ఆన్‌లైన్ వర్కులు ఆపాలని, మెటర్నిటీ లీవులు, ప్రభుత్వ సెలవులు ఆశాలకు అమలు చేయాలని, విధి నిర్వహణలో అధికారులు వేధింపులు నివారించాలని, ఎన్‌సిడి సర్వే ఆశాలకు సంబందం లేదని ఉతర్యులు ఇవ్వాలని, రూ.10 లక్షల బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా గౌరవాధ్యక్షులు జి.బేబిరాణి, అధ్యక్ష కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జి మాట్లాడారు. గతంలో ఆందోళనల సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని కాబట్టే ఆశాలు నిరంతరం పోరాడాల్సిన పరిస్థితికి జిల్లా అధికారులే కారణమని విమర్శించారు. ఆశాలు నిర్వహించాల్సిన విధులు ఏమిటో జాబ్ ఛార్ట్ ఇవ్వకుండా ప్రభుత్వాధికారులు చేయాల్సిన అన్ని పనులనూ ఆశాలతో చేయించడం తగదన్నారు. 1000 మంది పరిధిలో ఒక ఆశా వర్కర్ ఉండాల్సింది పోయి ఐదు వేల మంది ప్రజల మధ్యన ఒక ఆశా వర్కర్‌తోతో పని చేయిస్తూ గొడ్డుచాకిరీ చేస్తున్నారన్నారు. తుని ఆశా కార్యకర్తలకు నాలుగు నెలల వేతనం బకాయి పెడితే ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ఫీల్డ్‌లో తిరగాల్సిన ఆశా వర్కర్లను సచివాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు కూర్చోబెడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రికార్డులు సైతం ఆశాల సొంత డబ్బులతో కొనాలని అధికారులు చెప్పడం కంటే సిగ్గుచేటైన పని మరొకటి లేదని విమర్శించారు. యు.కొత్తపల్లి ప్రాంతంలో ఫ్యామిలీ ఫిజీషియన్ ప్రోగ్రాం గ్రామాల్లో నిర్వహిస్తున్నప్పుడు ఆశాల చేత టేబుల్స్, భోజనాలు, టిఫిన్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులు ఒత్తిడి చేయడం మాను కోవాలని హెచ్చరించారు. సమస్యలపై సమాధానం కోరుతూ ఆశాలు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోకి వెళ్లేందుకు సిద్ధపడడంతో డిఎంహెచ్‌ఒ డాక్టర్ రమేష్, ఎఒ సూర్యచంద్ర, డిపిహెచ్‌ఎన్‌ఒ రమణమ్మ, డిసిఎం మణికుమారి బయటకివచ్చి ఆశాలతో చర్చించారు. వారి డిమాండ్లపై స్పందిస్తూ ఆశాలకు జాబ్ ఛార్టు సాయంత్రంలోగా అందిస్తామని, లెప్పర్సీ సర్వే మినహా ఆన్‌లైన్‌లో వర్కులు మీరు చేయాల్సిన పని లేదని, సెల్ ఫోన్లు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయిస్తామని, ఆశాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని, సచివాలయానికి ఆశాలకు సంబంధం లేదని, ఆశాలు సచివాలయ రికార్డులో సంతకాలు చేయాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఆశా కార్యకర్తల హక్కుల పోరాటాలకు ఆటంకాలు కల్పించాలానే ఆదేశాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి పంపలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎం.లక్ష్మి, రాయుడు నాగలక్ష్మి, రమణమ్మ, జిల్లా కోశాధికారి నొక్కు లలిత, సహయ కార్యదర్శి ఎం.భారతి, గంగాభవాని, గ్రేసీ, రాజేశ్వరి, పద్మావతి, అనంతలక్ష్మి, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు నక్కెళ్ల శ్రీనివాసు, షేక్ పద్మ, జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌కుమార్, ఎం.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










