ప్రజాశక్తి-పలాస : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి అభివృద్ధి పనులు చేపడుతున్నామని పదో వార్డు కౌన్సిలర్ శార్వాణి గీత రవి తెలిపారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త పారసాంబ గ్రామంలో చేపడుతున్న రహదారి పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టిడిపి హయాంలో ఒక్క పైసా కూడా అభివృద్ధికి కూడా నోచుకోలేదన్నారు. ప్రస్తుతం మంత్రి అప్పలరాజు, చైర్మన్ గిరిబాబు సహకారంతో మంచి నీటి కోనేరు, దళిత వీధిలో తాగునీటి బావి, పవర్ బోర్, పెద్ద వీధిలో తాగునీటి పైపులైన్లు, తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాల నుంచి ముత్యాల పోలమ్మ గుడి వరకు రహదారి పనులు చేపట్టేందుకు టెండర్ పూర్తయినా కాంట్రాక్టరు ఇబ్బందుల వల్ల పనులు జాప్యమైందన్నారు. మరొక కాంట్రాక్టరు ద్వారా పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారని తెలిపారు. జంగాల వీధిలో త్వరలో విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో వాలంటీర్లు కృష్ణా, పురుషోత్తం, కామేష్, తదితరులు పాల్గొన్నారు.










