Nov 02,2021 06:40

    కోట్లాది పల్లె పేదలకు కాస్తంత ఆర్థిక ఆసరా కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (నరేగా) అమలుకు అత్తెసరు బడ్జెట్‌ కేంద్ర బిజెపి కార్మిక వ్యతిరేకతకు నిలువుటద్దం. 2021-22లో నరేగా ప్రతిపాదనలు రూ.73 వేల కోట్లు కాగా ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా ఐదు నెలలు ఉండగానే పద్దు ఖాళీ అయింది. కేటాయింపు కంటే రూ.8 వేల కోట్లకుపైన పనులయ్యాయి. ఇవి రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిన బకాయిలు. ఖరీఫ్‌లోనే నరేగా పద్దు నిండుకుంటే, రానున్న వేసవిలో ఉపాధి పనులకు బాగా డిమాండ్‌ వస్తుంది. గ్రామీణ పేదలకు పనులెలా చూపిస్తారన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. దేశంలోని 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 21 తమకు కేటాయించిన నరేగా నిధులను వంద శాతం ఉపయోగించాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ 130 శాతం పనులు చేశాయి. ఈ వివరాలు ప్రతిపక్షాలో, గిట్టని మీడియానో చెప్పినవి కావు. నరేగా తన స్వంత ఆర్థిక నివేదికలో వెల్లడించినవి. వాస్తవాలు బహిర్గతం కావడంతో నిధులకు ఇబ్బంది లేదని, మెటీరియల్‌ కాంపొనెంట్‌ విడుదల నిరంతర ప్రక్రియ అని కేంద్ర పెద్దలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
     2020-21 బడ్జెట్‌లో నరేగాకు రూ.50 వేల కోట్లు ప్రతిపాదించగా కరోనా మొదటి దశలో ఆకస్మిక లాక్‌డౌన్ల వలన గ్రామీణ కార్మికులకు పనులు కల్పించేందుకు రూ.1.11 లక్షల కోట్లకు బడ్జెట్‌ను సవరించారు. మహమ్మారి రెండవ దశ విలయం సమయాన 2021-22లో బడ్జెట్‌ను రూ.73 వేల కోట్లకు కుదించారు. మునుపటి ఏడాది కంటే 34 శాతం తగ్గించారు. కోట్లాది మందికి ఉపాధి కల్పించే నరేగా ప్రతిపాదన మొత్తం బడ్జెట్‌ వ్యయంలో 2.1 శాతం మాత్రమే. అరకొర కేటాయింపుల పర్యవసానంగా అప్పుడే నిధులైపోయాయి. అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా నిధులు కేటాయించకుండా, రాష్ట్రాలు కృత్రిమ డిమాండ్‌ సృష్టిస్తున్నాయని మోడీ సర్కారు నెపం వేయడం, ఉపాధి కల్పనలో తన బాధ్యత నుండి తప్పించుకునే ఎత్తు. నిధులైపోయాయి కాబట్టి అక్కడికేదో ఇబ్బడిముబ్బడిగా కార్మికులకు పనులు దొరికాయని కాదు. పనులు కావాలని కోరిన వారిలో 13 శాతం మందికి పని చూపించలేదు. పనుల కోసం కూలీలు పెట్టుకున్న అభ్యర్ధనలను నిధుల కొరత కారణంగా తిరస్కరిస్తున్న సందర్భాలనేకం. రోజువారీ కూలీల ఆత్మహత్యలు 26.4 శాతం పెరిగాయని మొన్ననే నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించిందంటేనే కూలీలు పనులు దొరక్క ఏ విధంగా అలమటిస్తున్నారో అర్ధమవుతోంది.
      నరేగా గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఏడాదిలో కనీసం వంద రోజుల పనులను గ్యారంటీ చేసింది. పల్లె జనం ఉపాధికి నరేగా పెద్ద అండ. కరోనాతో వలస కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు పనుల్లేని సమయంలో నరేగా ప్రాణదాతగా నిలిచింది. కుదేలైన ఆర్థిక వ్యవస్థ కొంతైనా నిలబడేందుకు ఉపయోగపడింది. కరోనాతో కోట్లాది మంది వలస కార్మికులు తమ ఊళ్లకు తరలొచ్చారు. గ్రామాల్లో ఉపాధిపై ఒత్తిడి పెరిగింది. ఈ తరుణంలో నరేగాను మరింత విస్తృత పర్చాల్సిన బిజెపి ప్రభుత్వం అందుకు భిన్నంగా నిరుటి కంటే నిధులు తగ్గించింది. పనులు చేసిన కూలీలకు నెలల పర్యంతం వేతన బకాయిలు పెట్టింది. వేతనాల చెల్లింపుల్లో జాప్యం వలన గ్రామీణ వినియోగం పడిపోయి యావత్‌ జాతి ఆర్థిక వ్యవస్థ కుంగడానికి కారణమైంది. కనీస పని దినాలను, కనీస వేతనాన్ని పెంచాలని, పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలని వ్యవసాయ కార్మికులు డిమాండ్‌ చేస్తుండగా కేంద్రం ఉన్నదానికే ఎసరు పెట్టింది. ఇతర డిపార్టుమెంట్లకు అనుసంధానం, నిధులకు కోత, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం వంటి చర్యలతో నరేగా నిర్వీర్యానికి చేయని ప్రయత్నం లేదు. వేతనాల చెల్లింపుల్లో ఎస్‌.సి, ఎస్‌.టి లకు ముందుగా పేమెంట్స్‌ అని పేదల్లో విభజనకు కుట్ర పన్నింది. ప్రజాగ్రహంతో వెనక్కి తగ్గినట్లు ప్రకటించినా, ఇప్పటి వరకు ఉత్తర్వులు ఇవ్వలేదు. పేదల ఉపాధి విషయంలో నర నరాన వ్యతిరేకత జీర్ణించున్న మోడీ ప్రభుత్వంపై గ్రామీణ పేదలు ఉద్యమించాలి. నరేగా చట్టం అమలుకు ప్రభుత్వ మెడలు వంచాలి.