Sep 07,2023 22:51

సమావేశంలో మాట్లాడుతున్న డి.శివకుమారి

ప్రజాశక్తి - దుర్గి : ఆశా కార్యకర్తలతో ఇతర పనులు చేయించబోమని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి హామీనిచ్చినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆశా వర్కర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శివకుమారి అన్నారు. మండల కేంద్రమైన దుర్గిలో బుధవారం నిర్వహించిన ఆశాకార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్‌సిడి సర్వేలు, వ్యాక్సిన్‌ బాక్సులు మోయించడం, సచివాలయాల్లో సంతకాలు తదితరాలకు ఆశా కార్యకర్తల వర్క్‌చార్ట్‌లో లేవని అన్నారు. అయినా ఒత్తిడి తెచ్చిమరీ ఈ పనులు చేయిస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా రెండు నెల్ల కిందట ఆశా కార్యకర్తలు ధర్నా చేయగా అధికారులు హామీనిచ్చారని గుర్తు చేశారు. వారాంతపు సెలవులు లేకుండా నిత్యం పని చేయిస్తున్నారని, రిటైర్మెంట్‌ బెనిఫిట్లు కూడా లేవని అన్నారు. ఆశాలకు గ్రూపు ఇన్సూరెన్స్‌ చేయించాలని కోరారు. ఆన్‌లైన్‌ వర్క్‌ అంటూ పనిచేయని ఫోన్‌ ఇచ్చి 2జి సిమ్ములతో పని చేయమంటే ఆశలు ఇబ్బందులు పడుతున్నారని, మంచి ఫోన్‌తోపాటు 4జి సిమ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఫోన్లు పోయినందుకు ముగ్గురు కార్యకర్తలతో డబ్బులు వసూలు చేయించారని, వాటిని ఇప్పటికీ ఇవ్వలేదని అన్నారు. ఇదిలా ఉండగా రికార్డు వర్కు, ఆన్‌లైన్‌ వర్క్‌ రెండింటిలో ఏదో ఒకటే చేయించాలని, రికార్డు వర్క్‌ అయితే ఆ రికార్డులను ప్రభుత్వమే ఇవ్వాలని హర్యానాలో గతనెల 8వ తేదీ నుండి ఆందోళన చేస్తున్న ఆశాలపై అక్కడి ప్రభుత్వం లాఠీఛార్జీ చేయించడం దారుణమని ఖండించారు. అనంతరం యూనియన్‌ దుర్గి, ముటుకూరు పిహెచ్‌సిలు, దుర్గి మండలం కమిటీలను ఎన్నుకున్నారు. దుర్గి అధ్యక్షులుగా ఎం.ధనలక్ష్మి, కార్యదర్శిగా అంకమ్మ, ముటుకూరు అధ్యక్షులుగా ఎస్తేరు, కార్యదర్శిగా సిహెచ్‌ రమణ, మండలం అధ్యక్షులుగా సిహెచ్‌ రమణ, కార్యదర్శిగా ఎం.అంకమ్మ మరొక ముగ్గురు సభ్యులు ఎన్నికయ్యారు. సమావేశంలో యూనియన్‌ జిల్లా అధ్యక్షులె కె.చంద్రకళ, ఆశాలు పాల్గొన్నారు.