May 09,2023 00:42

మాట్లాడుతున్న డిఎస్‌డిఓ సూర్యారావు

ప్రజాశక్తి-నక్కపల్లి:బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్‌ క్రీడాకారులు మరింతగా రాణించి ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఉమ్మడి జిల్లా డిఎస్‌డిఓ నగిరెడ్డి సూర్యారావు, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం ఆకాంక్షించారు. బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్‌ క్రీడాకారులు తిరుపతిలో ఈ నెల 1 నుండి 5 వరకు జరిగిన ఏపీ సీఎం కప్‌ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలో ఉమ్మడి విశాఖ జిల్లా బాలురు విభాగంలో ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో తృతీయ స్థానం సాధించిన సందర్బంగా గురువారం స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో అభినందన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన సూర్యారావు మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులకు మంచి తర్ఫీదును ఇచ్చిన కోచ్‌ రాంబాబును అభినందించారు. నక్కపల్లి లో బలిరెడ్డి సత్యవతి హాకీ క్లబ్‌ ఏర్పాటు చేసిన హాకీ క్లబ్‌ ఫౌండర్‌ సూరిబాబు, ప్రధాన కార్యదర్శి తాతాజీ లకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ చైర్మన్‌ పద్మ, పిడి కుందూరు రాజు, క్లబ్‌ అధ్యక్షులు చిన్న అప్పారావు, రామచంద్రరావు, నానాజీ, ప్రసాద్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.