హాజరు సంఖ్యతో భోజనం తయారుచేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : విద్యార్థుల హాజరు సంఖ్యను బట్టి తగు మోతాదులో పప్పు, నూనె వస్తువులతో మధ్యాహ్న భోజనం తయారు చేయాలని మండల విద్యాశాఖ అధికారి షేక్ మస్తాన్ వలీ పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల దాసరపల్లి పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో జరుగుతున్న జగనన్న మనబడి నాడు-నేడు పనులను పరిశీలించారు. నాడు-నేడు పనులలో నాణ్యమైన వస్తువులను వాడుతూ నాణ్యతతో త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తయిన కాంక్రీట్ పనులకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూట వాటర్‌తో క్యూరింగ్ చేయాలని ఆదేశించారు. నాడు-నేడు రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ముఖ్యంగా ప్రతి పనికి తీర్మానాల రిజిస్టర్, నగదు రిజిస్టర్‌లో తీర్మానాలు రాసి నాడు-నేడు కమిటీ సభ్యులతో సంతకాలు చేయించాలని తెలియజేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా తయారు చేయాలన్నారు. విద్యార్థుల హాజరు సంఖ్యను బట్టి పప్పు, నూనె ఇతర వస్తువులు వేసి రుచికరంగా కూరలు తయారు చేయవలెనని తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాబిరా బేగం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










