ప్రజాశక్తి - ఆదోని
'ఒక్క ఛాన్స్' అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముస్లిం, మైనారిటీలకు న్యాయం చేయడం లేదని, మైనార్టీ బాలిక అత్యాచారం, హత్యకు గురైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా హాజీరాబీ హంతకులకు ఉరిశిక్ష వేయాలని ఆదోని ముస్లిం, మైనారిటీ నాయకులు ఉమ్మి సలీమ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళలతో కలిసి నిరసన చేపట్టారు. ఆదోని డివిజన్‌లోని గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామంలో మైనార్టీ బాలిక హాజీరాబీపై మూడేళ్ల క్రితం అత్యాచారం చేసి హత్య చేశారని తెలిపారు. ఇంతవరకు దీనిపై ఎందుకు స్పందించలేదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తెలంగాణలో ఒక అగ్రవర్ణ వర్గానికి చెందిన మహిళను అత్యాచారం చేసి, హత్య చేస్తే 24 గంటల్లోనే అక్కడి ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్‌కౌంటర్ చేయించారని చెప్పారు. దీనికి స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆంధ్రలో దిశ అనే చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఆ దిశ చట్టానికి దశ దిశ లేదని విమర్శించారు. గోనెగండ్ల మండలంలో మైనార్టీ బాలిక అత్యాచారానికి, హత్యకు గురై మూడేళ్లలైనా ఇంతవరకు ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోలేదని, ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు. పొలంలో ఉన్న తండ్రికి క్యారియర్ ఇవ్వడానికి వెళ్లిన హాజీరాబీని అదే గ్రామానికి చెందిన నలుగురు అత్యాచారం, హత్య చేస్తే అప్పట్లో అక్కడ ఎస్‌ఐగా ఉన్న హనుమంతు రెడ్డి ఆ కేసును పక్కదారి పట్టించారన్నారు. ఎస్‌ఐ హనుమంతు రెడ్డిని సస్పెండ్ చేయాలని, హంతకులకు ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ముస్లిం, మైనారిటీ మహిళలకు జరిగిన అన్యాయంపై తాను శాంతియుతంగా స్పందనలో అర్జీ సమర్పిస్తానని, అనుమతి ఇవ్వాలని స్థానిక డీఎస్పీని కోరితే తనను డీఎస్పీ కార్యాలయం చుట్టూ తిప్పుకొని చివరకు అనుమతి ఇవ్వలేదన్నారు. ఇదే వైసిపి నాయకులు ఎన్ని ర్యాలీలు, ప్రదర్శనలు చేసినా అనుమతులు ఇచ్చారని తెలిపారు. కేవలం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆజ్ఞతోనే తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. ఈ విషయంపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, లోకాయుక్తకు వెళ్లి న్యాయపోవటం చేస్తానని తెలిపారు. అనంతరం మహిళలు సలీం ఆధ్వర్యంలో గాజులు, చీరలను జగన్ చిత్రపటానికి అందజేసి హాజీరాబీకి న్యాయం చేయాలని కోరారు. సబ్ కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి గోవింద్ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.
నిరసనలో మాట్లాడుతున్న ఉమ్మి సలీమ్










