Jul 30,2021 21:41

వాషింగ్టన్‌ : భారత్‌లోని ఐటి ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసే హెచ్‌1బి వీసాలకు తాజాగా దరఖాస్తులను ఆగస్టు 2 నుండి స్వీకరించనున్నారు. 2022 సంవత్సరానికి జారీ చేయాల్సిన హెచ్‌ 1బి వీసాల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ర్యాండమ్‌ పద్ధతిలోఎంపిక ద్వారా ఈ వారం ప్రారంభంలో రిజిస్ట్రేషన్లను స్వీకరించారు. ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన దరఖాస్తులనే వచ్చే నెల 2 నుండి తీసుకోనున్నారు. 2022లో హెచ్‌-1బి వర్క్‌ పర్మిట్‌ కోసం తొలి రిజిస్ట్రేషన్‌ సమయంలో అంటే జూన్‌లో అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సంస్థకు 3,80,000కు పైగా దరఖాస్తులు అందాయి. ప్రస్తుత సంవత్సరంలో కన్నా ఇది 12.5శాతం ఎక్కువ. అక్టోబరు నుండి సెప్టెంబరు వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. కానీ హై టెక్నాలజీ వర్క్‌ పర్మిట్‌ కోసం 87,500 దరఖాస్తుదారులనే ఎంపిక చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి హెచ్‌-1బి లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన రిజిస్ట్రేషన్లను లెక్కించేందుకు అప్రూవల్స్‌, తిరస్కరణలు, ఉపసంహరణలు, ఇతర సంబంధిత అంశాలతో కూడిన చారిత్రక డేటాను ఉపయోగించామని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో కంప్యూటరైజ్డ్‌ డ్రాలో తగిననన్ని వీసాలు జారీ చేయలేకపోవడంతో మరోసారి లాటరీలు తీయాలని నిర్ణయించారు. హెచ్‌-1బి పిటిషన్లకు ఆన్‌లైన్‌ ఫైలింగ్‌లు అందుబాటులో లేవు. వారు తప్పనిసరిగా కాగితాల ద్వారానేదరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది.