Aug 01,2021 17:09

న్యూఢిల్లీ : 2021జులై మాసానికి సంబంధించి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) రికార్డు స్థాయిలో 1.16 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. మొత్తం 1.16 లక్షల కోట్ల జిఎస్‌టి వసూలులో.. సిజిఎస్‌టి రూ.22.19 వేల కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ.28.53 వేల కోట్లు ఉన్నాయి. ఇక దిగుమతులకు సంబంధించి ఐజిఎస్‌టి రూ.57.86 వేల కోట్లు వసూలు అయినట్టు మంత్రి తెలిపారు. ఇక, గతేడాదితో పోల్చితే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో జిఎస్‌టి వసూళ్లు పెరిగాయి. 2020 జులైలో ఎపిలో రూ.2,138 కోట్లు ఉండగా.. ఈ ఏడాది రూ.2,730 కోట్లు వసూలయ్యాయి. తెలంగాణకు సంబంధించి జిఎస్‌టి వసూళ్లు రూ.2,876 కోట్ల నుంచి రూ.3,610 కోట్లకు పెరిగాయి. తెలంగాణలో జిఎస్‌టి వసూళ్లు 26 శాతం పెరగగా.. ఎపిలో 28 శాతం పెరిగాయి.
ఇదిలా ఉండగా.. కరోనా కేసులు తగ్గుముఖం పట్డడంతో క్రమంగా జన జీవితం సాధారణ స్థితికి చేరుకుంటుందని, రెండు నెలలుగా ఆర్థిక కార్యాకలాపాలు పుంజుకుంటున్నాయని చెప్పడానికి జిఎస్‌టి వసూళ్లే నిదర్శనమని నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. కరోనా కారణంగానే మే, జూన్‌ల్లో జిఎస్‌టి వసూళ్లు తగ్గిపోయాయని తెలిపారు.