
అత్యంత కర్కశంగా సామూహిక అత్యాచారం.. మైనర్, గర్భిణీ అని చూడలేదు. ముళ్లపొదల్లో ఈడ్చుకెళ్లారు. చర్మం చీలి, రక్తంతో పాటు మాంసం వ్రేలాడుతోంది. అయినా వదల్లేదు. మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. ప్రతిఘటించే శక్తి లేదు. చిమ్మ చీకట్లో తమపై దాడి చేస్తున్న ముఖాలను చూసే వీలు లేని ఆ అర్ధరాత్రి సమయంలో దాడికి గురౌతున్న బాధితులందరికీ హాహాకారాలు, ఏడ్పులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంత తీవ్ర నేరం.. ఘోర తప్పిదం జరిగితే, అసలు ఆ సంఘటనే జరగలేదని బుకాయించారు పాలకులు. అన్నీ అబద్దాలే చెబుతున్నారని ఆరోపించారు. దాడి ఘటన వెలుగులోకి వచ్చేసరికి రెండు వారాల టైం పట్టింది. నిందితులపై కేసు నమోదు చేయడానికి నెలల సమయం వేచి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు, 31 ఏళ్ల తరువాత, ఆ నేరం రుజువై బాధితులకు పరిహారం అందేలా తీర్పు వచ్చింది. తమిళనాడు వాచాతి మహిళల కేసులో గత నెల సెప్టెంబరు 29న తీర్పు వచ్చింది. మహిళలపై జరిగిన దారుణం, బాధితుల పోరాటం, తాజా తీర్పుపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
తమిళనాడు, వాచాతి గ్రామం.. 1992 జూన్ 20 అర్ధరాత్రి సమయం.. యూనిఫాం వేసుకున్న వందలాది మంది వ్యక్తులు గ్రామంపై విరుచుకుపడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లు కొట్టారు. ఇళ్లల్లో సామాను ధ్వంసం చేశారు. ముసలివారు, పిల్లలు అని చూడలేదు. ఎక్కడపడితే అక్కడ కొట్టుకుంటూ రోడ్డు మీదకు ఈడ్చారు. రక్తం వచ్చేలా కర్రలతో కొట్టుకుంటూ పురుషులను జీపుల్లోకి ఎక్కించారు. పశువులను ఎక్కించినట్లు కొట్టుకుంటూ, దూషిస్తూ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి మహిళలను లారీలు ఎక్కించారు. వారిలో ఓ 18 మందిపై ఆ మూక సామూహిక అత్యాచారానికి తెగబడింది. అందులో 13 ఏళ్ల బాలిక, నిండు గర్భిణీ కూడా ఉన్నారు.
- వారు చేసిన నేరం ఏమిటి?
తమిళనాడులో మలయాళీ ఆదివాసీ తెగ నివసించే గ్రామం వాచాతి. ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టిన ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌కు ఆ గ్రామంతో సంబంధాలున్నాయని, గ్రామస్తులు కూడా స్మగ్లింగ్‌లో భాగమయ్యారని అటవీశాఖ, రెవిన్యూశాఖ గ్రామ ప్రజలపై ఆరోపణలు చేశాయి. ఇదే విషయంపై ఆ రోజు ఉదయం పూట గ్రామంలో పోలీసులకు, గ్రామపెద్దలకు మధ్య చర్చలు కూడా నడిచాయి. విచారణ చేస్తామని, ఆదేశాలను కచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నప్పుడు మూగ, చెవిటి బాధితుడైన ఓ పెద్దాయన విషయం అర్థంకాక నిర్లిప్తంగా ఉన్నాడు. అతని ధోరణి నచ్చని ఓ పోలీసు ఆ వృద్ధుడి చెంపపై గట్టిగా కొట్టాడు. ఊహించని ఆ పరిణామంతో ఆ పెద్దాయన నేల మీద పడిపోయాడు. దీంతో గుమిగూడి వున్న జనానికి, పోలీసులకు మధ్య అప్పుడు స్వల్ప ఘర్షణ జరిగింది. ఆ రోజు రాత్రే పోలీసులు గ్రామంపై విరుచుకుపడ్డారు. దారుణానికి ఒడిగట్టారు.
- భయంకర గతాన్ని ధరతో వెలకట్టలేరు..
'ఆ రోజు రాత్రంతా వాళ్లు మా ఇళ్లపై దాడి చేస్తూనే ఉన్నారు. చాలామంది తలో దిక్కు పారిపోయారు. కొంతమంది అడవిలోకి వెళ్లి దాక్కున్నారు. చాలా ఘోరంగా మాపై అత్యాచారం చేశారు. ఆ తరువాత మమ్మల్ని లారీల వద్దకు ఈడ్చుకెళ్లారు. ఫారెస్ట్ ఆఫీసులో పెట్టి మళ్లీ మాపై దాడి చేశారు. పసిపిల్లకు దాహంగా ఉందని ఒకామె నీళ్లు అడిగితే ఓ పోలీసాయన మూత్రం పోసి ఇచ్చాడు. ఆకలిగా ఉందని అడిగితే వాళ్లు తినేసిన ఎంగిలి బొక్కలు తినమన్నారు. మా కళ్ల ముందే గ్రామపెద్దను కర్రలతో కొట్టి చంపారు. ఆ రాత్రి మేము ఒకరికొకరం కలుసుకోకుండా చేశారు' అంటూ పద్మ (పేరు మారింది) ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ చేదు గతాన్ని గుర్తు చేసుకుంది. దాడికి గురైనప్పుడు ఆమె వయసు 17. 'ఇన్నేళ్ల తరువాత వెలువడిన ఈ తీర్పు, ప్రకటించిన పరిహారం సొమ్ముతో మేము కోల్పోయిన సంతోషకరమైన గౌరవప్రదమైన జీవితంతో వెలకట్టలేరు' అంటూ ఆమె గద్గద స్వరంతో మాట్లాడుతోంది.
'రెండు వారాలు పాటు మమ్మల్ని అక్కడే బంధించారు. ఆకలి వేసినప్పుడు వాళ్లు తినగా నేలపై ఉమ్మి వేసిన ఆహారాన్ని తినమనేవారు. మోకులు కట్టిన గంధపు చెక్కల ముందు మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా ఫొటోలు తీశారు. జడ్జి ముందు నోరు తెరవొద్దని బెదిరించారు' అంటూ ఆనాటి భయంకర రోజులను గుర్తుచేసుకుంది మరో బాధిత. దాడికి గురైనప్పుడు ఆమె వయసు 15.
ఆరోజు బాధితులతో పాటు మరో 90 మంది మహిళలను, 28 మంది పిల్లలను బంధించారు. జైల్లోనే ఒకామె ప్రసవించింది. 'అప్పుడు పోలీసులు కొట్టిన దెబ్బలకు నరాలు బలహీనపడి నా రక్తం ఇప్పటికీ గడ్డకుండా ఉంటోంది. మాకు ఏం జరుగుతుందో తెలియకుండా రోజుల తరబడి భయంకరమైన రోజులు గడిపాం' అంటోంది 70 ఏళ్ల వృద్ధురాలు.

- బావిలో రక్తం, కిరోసిన్ పోశారు
'సంఘటన జరిగిన కొన్ని రోజులకు నేను గ్రామానికి వెళ్లాను. గ్రామమంతా ఎడారిలాగా అనిపించింది. ఎవ్వరూ కనపడలేదు. రాత్రుళ్లు శ్మశానంలో ఉన్నాననిపించేది. ఇది కొండ చివర ఉన్న చాలా చిన్న గ్రామం. అలాగని జనాభా తక్కువేమీ కాదు. 186 ఇళ్లు, 600 జనాభా ఉండేది. సౌకర్యాలు లేక అభివృద్ధికి నోచుకోలేదు. ఆ రోజు నేను గ్రామంలో చూసిన దృశ్యాలు ఇప్పటికీ నా కళ్ల ముందే ఉన్నాయి. ఇళ్లన్నీ కూలిపోయాయి. పైకప్పులు కిందకు చొచ్చుకుపోయాయి. చిరిగిన దుస్తులు, విరిగిన పాత్రలు, ధ్వంసం చేసిన ధాన్యం గిడ్డంగులు, గాజుపెంకులు, కిరోసిన్‌తో నిండిన బియ్యం బస్తాలు ... ఇలా ఎక్కడ చూసినా ఇవే కనిపించాయి. ఇంకా ఊరందరికీ తాగు నీరు అందించే బావి రక్తం, కిరోసిన్, నూనె, జంతువుల అవశేషాలతో నిండిపోయింది' అంటూ ఆనాటి దారుణ ఘటనను గుర్తు చేసుకున్నారు స్థానిక సిపిఎం సభ్యులు.
ఈ మూడు దశాబ్దాలు సిపిఎం, తమిళనాడు ట్రైబల్ అసోసియేషన్ (టిఎన్‌టిఎ) బాధితులకు అండగా నిలిచాయి. ప్రతి విచారణకు హాజరవ్వడమే కాక, నిరక్షరాస్యులైన బాధితులకు దిశానిర్దేశం చేస్తూ వచ్చాయి.
'పోలీసులు గ్రామస్తుల ఇళ్లల్లో జొరబడినప్పుడు వారు ఆరోపించినట్లు అక్కడ గంధపు చెక్కలు కనపించలేదు. ఆ రోజు ఉదయం గ్రామంలో జరిగిన చిన్న ఘర్షణకు ప్రతీకారంగానే ఇంతటి అమానుషానికి పాల్పడ్డారు. పాలకులు, అటవీ అధికారులు కుమ్మక్కై గంధపు చెక్కల స్మగ్మర్లతో చేతులు కలిపారు. రాత్రికి రాత్రే టన్నుల కొద్దీ దుంగలను నరికించేసి, నేరం వాచాతి గ్రామస్తులపైకి నెట్టారు' అని అప్పట్లో సిపిఎం జిల్లా కోర్డినేటర్‌గా ఉన్న ఢిల్లీబాబు ఆనాటి సంఘటనను వివరించారు.
- తీర్పులో ఏం చెప్పారంటే..
మొత్తం 269 నిందితుల్లో జీవించి ఉన్న 215 మంది నిందితులకు 2011లో ట్రయల్ కోర్టు 1 నుండి 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. దీనిపై నిందితులు మద్రాసు హైకోర్టుకు అపీలు చేశారు. 12 ఏళ్ల తరువాత దీనిపై మద్రాసు హైకోర్టు తీర్పు ఇచ్చింది. బాధితులు ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. పరిహారం సొమ్ములో సగభాగాన్ని నిందితుల నుండి వసూలు చేయాలని చెప్పింది.