
చెట్టు మీద ఉన్న గండు చీమకు నీటిపై ప్రయాణం చేయాలని ఆశ కలిగింది. చెట్టునుండి కిందకు రాలిన ఆకును తనని నీటిపై తీసుకెళ్ళమని అడిగింది. ఆకు సరేనని తన వీపుపై చీమని ఎక్కించుకుని ప్రయాణం చేయసాగింది. నీటిపై ప్రయాణం చేస్తున్న చీమకు ఈత కొడుతున్న చేపను చూసి తను కూడా ఈత కొట్టాలని కోరిక కలిగింది. వెంటనే చేపతో 'చేప మిత్రమా! నాకు ఈత నేర్పించవా' అని అడిగింది. చేప సరే అంటూ చీమకు ఈత ఎలా కొట్టాలో నేర్పించింది. చీమ ఆనందంగా ఈత కొట్టింది.
ఇంతలో గాలిలో ఎగురుతున్న పిచ్చుకను చూసి గాలిలో ప్రయాణం చేయాలని అనిపించి పిచ్చుకతో 'పిచ్చుక బావా నన్ను గాలిలో తిప్పవా' అని అడిగింది. పిచ్చుక సరేనంటూ తనపై ఎక్కించుకుని గాలిలో తిప్పింది. ఈసారి చీమకి తాను పిచ్చుకలా గాల్లో ఎగరాలని అత్యాశ కలిగింది. వెంటనే పిచ్చుకతో 'నాకు నీలా ఎగరాలని ఉంది .నీ ఈకలు ఇస్తే ఎగురుతాను' అని అంది. అందుకు పిచ్చుక 'ఎగరడానికి రెక్కలు ఉండాలి గాని, ఈకలతో ఎగరలేము' అని అంది.
'పరవాలేదు నేను ఎగురుతాను. వాటిని అంటించుకున్నాక. నన్ను పై నుండి వదిలేయి. అలాగే ఎగురు కుంటూ వస్తాను' అని పట్టు పట్టింది చీమ. 'సరే నీ ఇష్టం' అంటూ పిచ్చుక రెండు ఈకలు ఇచ్చి గాల్లో వదిలేసింది.
అంతే! వాటిని అంటించుకున్న చీమ, గింగిరాలు కొడుతూ కింద పడింది. ఇంకేముంది కాళ్ళు విరిగి, నడవలేక, ఈదలేక, ఎగరలేక ఓ మూల కూర్చుంది. తన అత్యాశ వల్ల తనకీ గతి పట్టిందని దు:ఖించింది.
- కయ్యూరు బాలసుబ్రమణ్యం,
77802 77240