Aug 09,2021 09:59

ఏథెన్స్‌ : గ్రీస్‌లో అగ్నిమాపక విభాగానికి చెందిన పెజెటెల్‌ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పౌర రక్షణ ఉప మంత్రి నికోస్‌ హర్దాలియాస్‌ మాట్లాడుతూ... గ్రీస్‌, టర్కీ లు దాదాపు రెండు వారాలుగా అగ్ని ప్రమాదాలకు గురవుతున్నాయని తెలిపారు. ఈ ప్రాంతంలో దశాబ్దాల్లో అత్యంత తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, ఇప్పటివరకు మంటల్లో చిక్కుకొని గ్రీస్‌లో ఇద్దరు, టర్కీలో ఎనిమిదిమంది మరణించారని చెప్పారు. డజన్ల కొద్దీజనం ఆసుపత్రి పాలయ్యారని, ఇప్పటికే వందలాది మంది ప్రజలు తమ తమ నివాసాలను వదిలి వెళ్లిపోయారని అన్నారు. వారాంతంలో వర్షం కురవడంతో టర్కీలో వేడి నుంచి కొంత ఉపశమనం లభించినా.. గ్రీస్‌లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయని అన్నారు. అగ్ని ప్రమాదాల నేపథ్యంలో 17 అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్‌లు రెండో అతిపెద్ద ద్వీపమైన ఎలివియాలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తుండగా... పెజెటెల్‌ విమానం కూలిపోయిందని చెప్పారు. ఇతర అగ్నిమాపక సిబ్బంది సాయంతో పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని నికోస్‌ హర్దాలియాస్‌ పేర్కొన్నారు.