Jul 23,2021 16:19

ములుగు : ఎగువ రాష్ట్రాలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నిదీ ఉప్పొంగుతోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానూ కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమౌతోంది. గోదావరికి వరద ముంచెత్తుతుండటంతో ఎక్కడికక్కడ రహదారులపై వరద నీరు పొంగిపోర్లుతోంది. ఈ క్రమంలోనే జాతీయ రహదారి 163 పైకి గోదావరి వరద నీరు వచ్చి చేరడంతో ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండలంలోని పావురాల వాగు బ్రిడ్జి పైకి వరద నీరు చేరడంతో ఇరు రాష్ట్రాల వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఇవాళ, రేపు కూడా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరోపక్క నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. స్థానికంగా ఉన్న సావెల్‌ ఆశ్రమంలోకి నీళ్లు చేరడంతో ఆశ్రమంలో ఉన్న ఏడుగురు స్వామీజీలు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు ఆశ్రమానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఏడుగురు స్వామీజీలను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాయి.

శ్రీరాంసాగర్‌కు వరద ప్రవాహం..
మరోవైపు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో జలాశయంలోకి 2.3 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తిన అధికారులు.. 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,089.80 అడుగుల వద్ద ఉంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 90 టిఎంసిలు కాగా.. ప్రస్తుతం 83.772 టిఎంసిల నీరు నిల్వ ఉంది.