
ప్రజాశక్తి-విశాఖపట్నం : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం నూతన ఛాన్స్‌లర్‌గా ప్రముఖ బయోటెక్నాలజీ, జన్యు శాస్త్రవేత్త, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) మాజీ చైర్మన్ డాక్టర్ వీరేంద్ర సింగ్ చౌహన్ గురువారం నియమితులయ్యారు. ఇప్పటి వరకు గీతం ఛాన్స్‌లర్‌గా వ్యవహరించిన ప్రొఫెసర్ కోనేరు రామకృష్ణారావు స్థానంలో నూతన ఛాన్స్‌లర్‌గా విఎస్.చౌహన్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన డాక్టర్ విఎస్.చౌహన్ ఐఐటి కాన్పూర్‌లో కొంత కాలం అధ్యాపకులుగా పని చేశారు. నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ (నాక్) ఎక్సిక్యూటివ్ చైర్మన్‌గా ఆరు సంవత్సరాల పాటు సేవలందించారు. యుజిసి చైర్మన్‌గా ఏడాది పాటు (2017ా18) వ్యవహరించిన డాక్టర్ చౌహన్ దేశంలో మహిళా సాధికారికతకు ఉన్నత విద్య ద్వారా కృషి చేశారు. ఐక్యరాజ్యసమితిలోని జెనిటిక్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ అంతర్జాతీయ పరిశోధన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్తగా వ్యవహరించిన ఆయన మలేరియా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు గుర్తింపుగా 2021లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ ఢిల్లీలోని డాక్టర్ విఎస్.చౌహన్ సృగృహానికి వెళ్ళి నియామకపు పత్రాలను అందజేసి సన్మానించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం లక్ష్యాలను చేరుకోవడంలో డాక్టర్ చౌహన్ అంతర్జాతీయ అనుభవం ఉపయోగపడగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.