ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలంలోని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబులు పర్యటన నేపథ్యంలో గిరిజన సంఘం, ఆదివాసి జేఏసీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కొండ్ల సూరిబాబు, తాము సూరిబాబు, వంతు బాలకృష్ణ, పి సత్యనారాయణ, జర్తా రాజు, తదితరులను ఎక్కడకక్కడ పోలీసులు ఆదివారం అరెస్టులు చేసి రాజువొమ్మంగి జడ్డంగి పోలీస్ స్టేషన్ లకు తరలించారు. బోయ వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడాన్ని ఎందుకు ప్రశ్నించలేదని రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు ప్రశ్నించారు. ఒట్టిగడ్డ గ్రామ శివారులో ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ప్రయాణిస్తున్న కారును అడ్డగించి బోయ వాల్మీకులను ఎస్టీ జాబిలో జాబితాలో చేర్చే విషయంలో ఎమ్మెల్యే వైఖరి తెలపాలంటూ పట్టుబట్టారు. ఇది గమనించిన పోలీసులు లోతా రామారావును బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ జీప్ ఎక్కించి జడ్డంగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన గిరిజన సంఘం నాయకులను, ఆదివాసీ నేతలను తక్షణం విడుదల చేయాలని లోతా రామారావు డిమాండ్ చేశారు. ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించే అమాయక గిరిజనులపై కేసులు బనాయించడం అరెస్టులు చేయడం అ ప్రజాస్వామికమని దీన్ని గిరిజన సంఘంగా, ఆదివాసి జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్రమ అరెస్టులతో, బెదిరింపులతో ఉద్యమాలను ఆపలేరని, రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.










