ప్రజాశక్తి - వినుకొండ : ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై టిడిపి శ్రేణులు హత్యాయత్నానికి పాల్పడ్డాయని, వారి చర్యలను ఖండిస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడుదల రజిని అన్నారు. వినకొండలో ఘర్షణ నేపథ్యంలో పట్టణానికి గురువారం వచ్చిన ఆమె వినుకొండ, నరసరావుపేట ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి స్థానిక వైసిపి కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. నిరసన పేరుతో టిడిపి శ్రేణులు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడును గంటలపాటు కారులో నిర్బంధించి కారు పై దాడి చేశారని అన్నారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో టిడిపి లేదని అందుకు ఇటువంటి ఘర్షణ వాతావరణ సృష్టిస్తున్నారని విమర్శించారు.
ఎవర్నీ వదిలిపెట్టం
ఘర్షణలో గాయపడ్డ శావల్యాపురం మండలానికి చెందిన వైసిపి నాయకులు అంకారావును ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో పరామర్శించారు. అంకా రావుకు ఛాతి భాగంలో దెబ్బ తగిలినట్లు తెలిపారు. తమ పార్టీ నాయకులపై కార్యకర్తలపై దాడి చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టబోమని, చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు.
లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే కుట్రలో వైసిపి ప్రభుత్వం : పుల్లారావు
ప్రజాశక్తి - చిలకలూరిపేట : పల్నాడులో నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అలజడి సృష్టించడానికి వైసిపి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. స్థానిక పండరిపురంలోని తన నివాసంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.లోకేశ్ పాదయాత్ర ప్రవేశించడానికి ముందే ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడానికి వైసిపి ఎత్తుగడ వేస్తోందన్నారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడివి నియంతృత్వ పోకడలు, అవినీతిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న టిడిపి శ్రేణులపైకి ఎమ్మెల్యే వెళ్లడమేంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజాశక్తి - పల్నాడు జిల్లా :వినుకొండలో టిడిపి కార్యకర్తపైలపై వైసిపి దాడి ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదమని టిడిపి నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో పోలీసులు శాంతిభద్రతను గాలికి వదిలేశారని, వైసిపి గుండాలు దాడులను అడ్డగించకపోగా ప్రోత్సహించారని ఆరోపించారు. టిడిపి శ్రేణులపై కేసులు పెట్టడం పరిపాటైందని, పద్ధతి మార్చుకోకుంటూ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచచ్చరించారు.
ప్రజాశక్తి - బెల్లంకొండ : వైసిపి దాడులు, దౌర్జన్యాలను టిడిపి శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొని నిలబడతాయని తెలుగు యువత పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ అన్నారు. మండల కేంద్రమైన బెల్లంకొండలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అవినీతిని, వనరుల దోపిడీని ప్రశ్నించినందుకు టిడిపి జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు, కార్యకర్తలపై అక్రమ కేసు బనాయించారని, అధికార పార్టీకి తొత్తులుగా కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసిపి అరాచకాలను చూస్తూ ఊరుకోబోమన్నారు. సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, సర్పంచ్ జి.సముద్రం, నాయకులు జి.కొండయ్య, రామకృష్ణ, వి.వెంకటేశ్వర్లు, హుస్సేన్ పాల్గొన్నారు.










