Mar 30,2023 21:59

మోటారు సైకిల్‌ను ఢకొీన్న లారీ
భార్య, భర్త, మేనల్లుడు దుర్మరణం
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం

            లారీ మోటారు సైకిల్‌ను ఢకొీన్న ప్రమాదలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన గురువారం మధ్యాహ్నం తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం శివార్లలో సబ్‌స్టేషన్‌ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి మండలం కృష్ణారం గ్రామానికి చెందిన నక్క రవి (30), ఉష (27) దంపతులు తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఉంటున్న రవి సోదరి వేల్పుల కళావతి ఇంటికి రెండు రోజుల క్రితం వెళ్లారు. వీరు గురువారం గోకవరం నుండి సత్తుపల్లి తిరుగు ప్రయాణమయ్యారు. రవి, ఉష దంపతులు ద్విచక్రవాహనంపై బయల్దేరగా, సోదరి వేల్పుల కళావతి, అనంతకుమార్‌ దంపతులు, వారి ఇద్దరు కుమారులు జోసఫ్‌ బెంజిమెన్‌ (12), జారుబాబు బస్సులో బయల్దేరారు. వీరు జంగారెడ్డిగూడెం బస్టాండ్‌కు వచ్చేసరికి అనంతకుమార్‌ పెద్దకుమారుడు జోసఫ్‌ బెంజిమెన్‌ తన మేనమామ రవితో కలిసి మోటారు సైకిల్‌పై వస్తానని మారం చేశాడు. దీంతో రవి, ఉష దంపతులతోపాటు బెంజ్‌మెన్‌ను తమ మోటారుసైకిల్‌పై ఎక్కించుకుని బయల్దేరారు. వీరు ప్రయాణిస్తున్న మోటారు సైకిల్‌ జంగారెడ్డిగూడెం శివారు జాతీయ రహదారిపై విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని మరో లారీ ఓవర్‌టేక్‌ చేయబోతూ వీరి మీదకు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో వాహనంపై నుంచి ఎగిరిపడ్డ రవి, జోసఫ్‌ బెంజిమెన్‌ తలకు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాల పాలైన ఉషను స్థానికులు హుటాహుటీన 108 వాహనంపై జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం రాత్రి మృతి చెందింది. ఈ ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే వెనుక బస్సులో వస్తున్న బెంజిమెన్‌ తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదంలో తమ కుమారుడు, రవి మృతి చెందారని తీవ్ర షాక్‌కు గురయ్యారు. బెంజిమెన్‌ తల్లి కళావతి మతిస్థిమితం కోల్పోయి 'నా కొడుకు బెంజిమెన్‌ స్కూల్‌కు వెళ్లాలి.. ఆడుకునే టైమ్‌ అయ్యింది' అంటూ మాట్లాడటం అందరినీ కలిచి వేసింది. ఆమె ఆర్తనాదాలు విని అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.