
ఓ కుటుంబం మల్లెలలోని దర్గా దర్శనానికి ఆటోలో కడప నగర సమీపంలోని ఆజాద్‌నగర్ నుంచి బయలుదేరింది. ప్రొద్దుటూరులోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి మల్లెలకు పయనమయ్యారు. ఎర్రగుంట్ల పట్టణ సమీపంలోని ఓ కల్యాణ మండపం వద్దకు ఆటో రాగానే ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి వేగంగా వచ్చి ఢకొీంది. ఆటో కాస్త తునాతునకలైంది. వాహనంలోని వారందరూ చెల్లాచెదురుగా పడిపోయారు. ఆ దృశ్యం చూసిన వారందరి గుండెలు ఝల్లుమన్నాయి. మృతదేహాలను చూసి, క్షతగాత్రుల ఆహాకారాలు వింటూ కళ్లు చెమ్మగిల్లాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. ప్రజాశక్తి-ఎర్రగుంట్ల
ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రొద్దుటూరు రోడ్డు బైపాస్ వద్దనున్న ఎస్‌వి కల్యాణ మండపం వద్ద సోమవారం ఆటోను ఆర్‌టిసి బస్సు ఢకొీన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాల్లోకి వెళితే.. పులివెందుల డిపోకు చెందిన ఆర్‌టిసి బస్సు శ్రీశైలం వెళుతుండగా ప్రొద్దుటూరు నుంచి ఎర్రగుంట్ల వైపు వస్తున్న ఆటోను బస్సు వేగంగా వచ్చి ఢకొీట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢకొీనడంతో ఆటో నుజ్జునుజు అయింది. ఆటోలో మహిళా డ్రైవర్‌తో సహా 10 మంది ప్రయాణిస్తుండగా అందులో డ్రైవర్ అమీనా(20), షాకీర్ (10), మహమ్మద్(25), హసీనా(25) అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సిఐ ఈశ్వరయ్య, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఒకరికొకరు బంధువులు కావడంతో సమాచారం అందుకున్న మృతుల బంధువులు మృతదేహాల వద్ద రోధిస్తున్నారు. బస్సులో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. మృతి చెందిన మహమ్మద్, హసీనా భార్యాభర్తలు కడప నగరం ఆజాద్ నగర్ కాలనీకి చెందిన వారు. మహమ్మద్ కార్పెంటర్ పనిచేసుకుంటూ జీవనం సాగించేవారు. ప్రొద్దుటూరులోని తమ బంధువుల ఇంటికి వెళ్లి అక్కడి నుంచి మల్లెల గ్రామంలోని దర్గా దర్శనానికి అందరూ కలిసి ఆటోలో బయలుదేరారు. ప్రొద్దుటూరు నుండి ఎర్రగుంట్ల వైపు వెళుతున్న ఆటో ఎస్‌వి కల్యాణ మండపం వద్దకు రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్‌టిసి బస్సు ఢకొీట్టింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
క్షతగాత్రులను పరామర్శించిన ఆర్‌డిఒ
ఆర్‌టిసి బస్సు, ఆటోను ఢకొీన్న ఘటనలో గాయాలపాలై ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుగురిని జమ్మలమడుగు ఆర్‌డిఒ శ్రీనివాసులు పరామర్శించారు. ప్రమాద ఘటన గురించి ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రొద్దుటూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులకు సూచించారు.
ప్రమాదం దురదృష్టకరం : డిఎస్‌పి
ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జమ్మలమడుగు డిఎస్‌పి నాగరాజు పరామర్శించారు. ప్రమాదఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తులను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్‌కు తరలిస్తున్నామని తెలిపారు. ప్రమాదంలో నలుగురు మృతి చెందడం దురదష్టకరమని, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.