Sep 15,2023 21:12

ఘోర రోడ్డు ప్రమాదం

 ఓ రైతు కుటుంబం అద్దె వాహనంలో దైవ దర్శనాలకోసమని బయలుదేరింది. మొదట బసవేశ్వరునికి అభిషేకం చేసుకుని, తమ కుల దైవమైన శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలకు వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శించుకుని తిరిగి శుక్రవారం ఇల్లు చేరుకోవాలనుకున్నారు. గురువారం శ్రీవేంకటేశ్వరుని దర్శన భాగ్యం లభించకపోగా నిరుత్సాహంతో గుడి బయటే దేవుడికి దణ్ణం పెట్టుకున్నారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో తిరుమల నుంచి నిరుత్సాహంగా తమ ఊరికి తిరుగు ప్రయాణమయ్యారు. బాగా రాత్రి కావడంతో ఒక్కొక్కరుగా తాము ప్రయాణం చేస్తున్న తుఫాను వాహనంలోనే తూలుకుంటూ నిద్ర పోసాగారు. బహుశా డ్రైవర్‌ కూడా తూలాడేమో... పాపం శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతం ఎదురుగా వచ్చిన సిమెంటు లారీని వేగంగా గుద్దుకున్నాడు. తుఫాను వాహనం కాస్త తునాతునకలైంది. వాహనంలోని వారందరూ సినిమా పక్కీలో వాహనం అద్దాలు పగలి, తలుపులు విరిగి బయటకు విసిరేయబడ్డారు. ఆ దృశ్యం చూసిన వారందరి గుండెలు ఝల్లుమన్నాయి. మృతదేహాలను చూసి, క్షతగాత్రుల ఆహాకారాలు వింటూ కళ్లు చెమ్మగిల్లాయి. సమాచారం అందుకున్న పీలేరు, కెవి పల్లి పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళితే...ప్రజాశక్తి-పీలేరు
కర్నాటక రాష్ట్రం, బెళగావి జిల్లా, అథణి తాలూకా, బడచి గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 15 మంది నాలుగు రోజుల క్రితం తుఫాన్‌ వాహనం అద్దెకు తీసుకుని శ్రీశైలం, తిరుమల తీర్థయాత్రలకు బయలుదేరారు. గురువారం తిరుమలలో రద్దీ ఎక్కువ కావడంతో దైవదర్శనం దొరక్క రాత్రి 11:30 గంటలకు తమ స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున కె.వి.పల్లి మండలం మఠంపల్లి సమీపంలో ఆ భక్తుల వాహనాన్ని సిమెంట్‌ లారీ ఢకొీంది. ప్రమాద సమాచారం అందిన వెంటనే పీలేరు సిఐ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ, సిబ్బంది, కలకడ సిఐ నాగేంద్ర, కె.వి.పల్లి ఎస్‌ఐ లోకేష్‌ సిబ్బంది ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులు 11 మందిని పీలేరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి పంపారు. మృతదేహాలను కూడా శవ పరీక్ష నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించారు. వారు బెళగావి నుంచి పీలేరు చేరుకున్నాక మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కెవి.పల్లి ఎస్‌ఐ లోకేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా ఎస్‌పి కృష్ణారావు, రాయచోటి డిఎస్‌పి మహబూబ్‌ బాష, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
మృతుల్లో మరాఠా సమాజానికి చెందిన డ్రైవర్‌ హను మంతు సిద్దోలు జాదవ్‌ (30), లింగాయత సమాజంలో ఒకే రైతు కుటు ంబానికి చెందిన దంపతులు అజూరు హనుమంతు(38), అజూరు మనంద (38), తల్లీకూతుళ్లు అజూరు శోభ(36), అజూరు అంబిక(14) ఉన్నారు. గాయపడిన వారిలో అజూరు కస్తూరి, అజూరు మేఘ, అజూ రు శివానంద, అజూరు మునియప్ప, అజూరు మల్లప్ప, అజూరు అక్షిత, అజూరు ఉదరు, అజూరు సునంద, అజూరు మహేష్‌, అజూరు సాక్షి, అజూరు బసవరాజ్‌ ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విష మంగా ఉంది. మృతులు, గాయపడిన వారి బంధువులకు పోలీసులు సమాచారం అందడంతో వారు బెల్గాం నుంచి పీలేరుకు బయ లుదేరారు. వారు పీలేరుకు రావడానికి సుమారు 16 గంటలకుపైగా సమయం పట్టే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.