ప్రజాశక్తి-కాకినాడ యుటిఎఫ్ ఆవిర్భవించి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ యుటిఎఫ్ హోమ్‌లో జిల్లా అధ్యక్షుడు నగేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సదస్సులో రాష్ట్ర కార్యదర్శి అన్నారాం మాట్లాడుతూ చెన్నుపాటి, అప్పారి వెంకటస్వామి వంటి నాయకులు సంఘం కోసం తమ జీవితాలను, జీతాలను త్యాగం చేశారని తెలిపారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు ఐ.ప్రసాదరావు మాట్లాడుతూ హక్కులు- బాధ్యతలు రెండు నేత్రాలుగా, అధ్యయనం-అధ్యాపనం-సామాజిక స్పహ లక్ష్యాలతో యుటిఎఫ్ పని చేయడం వల్లనే రాష్ట్రంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా కొనసాగుతోందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా, అధికారుల నిరంకుశ వైఖరిపై అలుపెరుగని పోరాటం చేయడం ద్వారా ఎన్నో ఆర్థిక, సర్వీస్ కండిషన్స్ ప్రయోజనాలు ఉపాధ్యాయులకు అందాయని తెలిపారు. రాబోయే సంవత్సరంలో యుటిఎఫ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఇప్పటి నుంచే పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వర్మ, సత్తిరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రవర్తి, జిల్లా కార్యదర్శులు, సుమారు వంద మంది ఉపాధ్యాయులు వివిధ మండల, పట్టణాలు నుంచి వచ్చి పాల్గొన్నారు.










