ప్రజాశక్తి-సీతమ్మధార : విశాఖ పౌర గ్రంథాలయంలో అరసం విశాఖ శాఖ ఆధ్వర్యాన ప్రఖ్యాత కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి సంస్మరణ సభను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరసం ప్రధాన కార్యదర్శి ఉప్పల అప్పలరాజు మాట్లాడుతూ, ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి తన జీవితకాలమంతా అరసం రాష్ట్ర కార్యవర్గానికి సేవలందించారని కొనియాడారు. పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి అరసం అభివృద్ధికి ఎంతో కృషిచేశారన్నారు. మాజీ యుపిఎస్‌సి సభ్యులు కెఎస్.చలం మాట్లాడుతూ, కేతు విశ్వనాథరెడ్డి తెలుగు కథకు ధర్శరాజు వంటివారన్నారు. ఆయన రాసిన కథలు తెలుగు కథా సాహిత్యంలో అగ్రస్ధానంలో ఉంటాయని అభివర్ణించారు. కోడవటిగంటి కుటుంబరావు సాహిత్యం మొత్తం వివిధ భాగాలుగా విభజించి ఆయన ప్రచురింపజేయడం గొప్ప సాహిత్య కృషిగా భావించాలని డాక్టర్ డివి.సూర్యారావు పేర్కొన్నారు. విశ్వనాథరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించి పెట్టిన కథల సంపుటిని తాను మళయాలంలోనికి అనువదించానని చెబుతూ ఆ పుస్తకాన్ని సభలో ప్రదర్శించారు. ఎల్‌ఆర్ స్వామి మాట్లాడుతూ, విశ్వనాథరెడ్డి గొప్ప మానవతా వాది అని తెలిపారు. అరసం అధ్యక్షులు ఎ.సీతారత్నం మాట్లాడుతూ, విద్యారంగంలో అనేక స్థాయుల్లో పనిచేసి అవసరమైన మార్పులు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ సంస్మరణ సభలో అరసం ఉపాధ్యక్షులు ఎస్.హనుమంతరావు, కార్యదర్శి క్షేత్రపాల్‌రెడ్డి, శేఖరమంత్రి ప్రభాకర్, అడపా రామకృష్ణ, శిరేల సన్యాసిరావు, కె.మధుసూదన్, ఎమ్.సుబ్బారావు, పరవస్తుసూరి పిఎ రాజు, బొట్ట అప్పారావు పాల్గొన్నారు.










