Aug 09,2022 23:27

ప్రో-వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ గీతాంజలి బత్మనాబానేకు జ్ఞాపికను అందజేస్తున్న అతుల్‌ భట్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం : ఫోరం ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌ (విప్స్‌) ఆవిర్భావ దినోత్సవం యొక్క రజతోత్సవ వేడుకలను మంగళవారం స్టీల్‌ప్లాంట్‌లో ఘనంగా నిర్వహించారు. 1997లో స్థాపించబడిన ఆర్‌ఐఎన్‌ఎల్‌ యొక్క ఫోరమ్‌ ఫర్‌ విమెన్‌ ఇన్‌ పబ్లిక్‌ సెక్టార్‌ 25 సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ సిఎమ్‌డి అతుల్‌బట్‌ పాల్గొని మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట నడిపించడంలో సంస్థ మహిళా ఉద్యోగినులు అసాధారణ సహకారాన్ని అందించారని ప్రశంసించారు. సమాజంలో మహిళల పాత్రపై అవగాహన పెంపొందించడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నందుకు విప్స్‌ సభ్యులను అభినందించారు. స్టీల్‌ప్లాంట్‌ యొక్క అత్యంత సంక్లిష్టమైన సరఫరా గొలుసు నిర్వహణను సమర్ధవంతంగా నిర్వహిస్తున్న మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ షీలా ప్రియదర్శినిని అతుల్‌ భట్‌ అభినందించారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణం సాధించినందుకు పివి సింధును సిఎమ్‌డి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
గౌరవ అతిథి గీతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌ ప్రో-వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ గీతాంజలి బత్మనాబానే మాట్లాడుతూ, మహిళలు తమ జీవితంలో విజయం కోసం సమాజంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఎదుర్కొనే ధైర్య సంస్కారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులను సత్కరించారు. పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్‌ డైరెక్టర్లు డికె.మొహంతి, కెకె.ఘోష్‌, ఎకె.సక్సేనా తదితరులు పాల్గొన్నారు.