Oct 24,2023 20:40

పార్వతీపురంరూరల్‌.. ఆయుధ పూజ చేస్తున్న ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ ;

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : విజయదశమిని పురస్కరించుకుని మంగళవారం పోలీస్‌ కార్యాలయంలో ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ ఆయుధపూజ చేశారు. జిల్లా పోలీసు అధికారులకు, సిబ్బందికి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆయుధ పూజ పోలీసులు, భద్రతా దళాలకు అత్యంత ముఖ్యమైన పండగని చెప్పారు. పోలీసులు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు కట్టుబడి ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో రాజీలేకుండా వ్యవహరించాలని కోరారు. పార్వతీపురం రూరల్‌, పట్టణ పోలీస్‌ స్టేషన్లలో సిఐ కృష్ణారావు, ఎస్‌ఐ సింహాచలం, దినకర్‌, నారాయణ తదితరులు ఆయుధ పూజలు నిర్వహించారు.

వీరఘట్టం  :  మండలంలో మంగళవారం విజయదశమి పండగను ఘనంగా నిర్వహించారు. వీరఘట్టంలోని కోటదుర్గమ్మ ఆలయంలో ప్రధాన అర్చకులు ఎస్‌విఎల్‌ఎన్‌ శర్మయాజి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి యాత్రికులు భారీగా తరలివచ్చి పూజలు చేశారు. ఆలయం వద్ద శ్రీకృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
సీతానగరం : మండలంలో పలు గ్రామాలలో దుర్గాదేవి పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

 కురుపాం.. ఆయుధ పూజలు నిర్వహిస్తున్న కిశోర్‌ చంద్రదేవ్‌ దంపతులు
కురుపాం.. ఆయుధ పూజలు నిర్వహిస్తున్న కిశోర్‌ చంద్రదేవ్‌ దంపతులు

కోటలో ఆయుధపూజ
కురుపాం :
కురుపాం కోట వద్ద మంగళవారం కేంద్ర మాజీ మంత్రి వైరచర్ల కిషోర్‌ చంద్రదేవ్‌ దంపతులు ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు. దసరా నవరాత్రులు సందర్భంగా కోటలో ఖడ్గ దుర్గతల్లిని ప్రతిరోజూ అనువంశిక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. చివరి రోజు దసరా సందర్భంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.
గుమ్మలక్ష్మీపురం : దసరా సందర్భంగా జియ్యమ్మవలస మండలం ఇటిక గ్రామంలో ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ గిరిజన జీవనానికి వినియోగించే పనిముట్లకు దసరా రోజు పూజ చేయడం ఆనవాయితీగా వస్తోందని టిడిపి ఎస్‌టి సెల్‌ అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి నందివాడ కృష్ణబాబు తెలిపారు.
ఎస్‌పి కార్యాలయంలో ఆయుధ పూజ