ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రముఖ వ్యాపారవేత్త, ముత్యాల గ్రూప్ ఆఫ్ ఇండిస్టీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు సూర్యకుమారి దంపతుల ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కల్యాణం మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణ పురవీధుల్లో అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పలు గ్రామాల నుంచి విచ్చేసిన మహిళలు కోలాటాలు నిర్వహించారు. తప్పెట గుళ్ళు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు మధ్య స్వామి వారి ఊరేగింపు జరిగింది. ముందుగా సుంకరమెట్ట సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద నుంచి రింగ్ రోడ్డు, చిన్న నాలుగు రోడ్లు జంక్షన్, పోలీస్ స్టేషన్, ఎన్టీఆర్ స్టేడియం, నెహ్రూ చౌక్ మీదుగా ఊరేగింపు నరసింగరావుపేటలో ఎంవిఆర్ ఇంటి వరకు నిర్వహించారు. పట్టణ పురవీధుల్లో భారీ విద్యుత్ అలంకరణ, నెహ్రూ చౌక్ జంక్షన్, రామచంద్ర థియేటర్ జంక్షన్‌లో భారీ విద్యుత్తు ఆర్చిలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు సినిమా యాక్టర్లు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నరసింగరావుపేటలోని ఆయన స్వగృహంలో జరిగిన వెంకటేశ్వర కల్యాణాన్ని తిలకించేందుకు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ కల్యాణోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా ఆయన సొంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఈ కల్యాణోత్సవాన్ని సుమారు లక్షా 50వేల మంది తిలకించే ఏర్పాట్లు చేశారు. ముత్యాల వెంకటేశ్వరరావు సూర్య కుమారి, వారి కుమారులు సతీష్, రాజేష్ ఉత్సవ విగ్రహాల ఊరేగింపు రథంపై భక్తులకు అభివాదం చేశారు. ఊరేగింపు పండగ వాతావరణం తలపించింది.










