Mar 23,2023 21:27

పంచాంగానికి హాజరైన కలెక్టర్‌, జడ్పి చైర్మన్‌, మున్సిపల్‌ చైర్మన్‌, డిఆర్‌ఒ

 

పంచాంగాన్ని వివరిస్తున్న వేద పండితులు
పంచాంగాన్ని వివరిస్తున్న వేద పండితులు

 

ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు
- జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి
- జిల్లా పరిషత్‌ చైర్మన్‌, కలెక్టర్‌
- కరణం సుధీంద్ర ఆచారి ఉగాది పంచాంగ శ్రవణం
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

       శోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ ఆకాంక్షించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో దేవదాయ ధర్మాదాయ శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ మాబున్నిసా, డిఆర్‌ఒ పుల్లయ్య, డిసిఎంఎస్‌ చైర్మన్‌ సి.హెచ్‌ శిరోమణి మద్దయ్య, రాష్ట్ర హస్తకళల డైరెక్టర్‌ సునీత అమృతరాజ్‌, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుధాకర్‌ రెడ్డి, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టరేట్‌ ఆవరణ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ వరకు మంగళ వాయిద్యాల మధ్య జిల్లా కలెక్టర్‌కు పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేడుకల్లో తొలుత కరణం సుధీంద్ర ఆచారి శాస్త్రోక్తంగా గణపతి పూజ నిర్వహించి ఆశీర్వదించారు. అనంతరం పంచాంగ శ్రవణం గావించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ షడ్రుచుల సమ్మేళనమై ఉగాది పచ్చడి అందరిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుం దన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని, ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ప్రజలందరికీ అన్ని శుభాలే కలగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తూ అందిస్తున్న సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు.
అర్చకులకు ఉగాది పురస్కారాల ప్రదానం :
దేవదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ప్రభుత్వం నుండి జిల్లాకు చెందిన కోటపాడు గ్రామ చెన్నకేశవ స్వామి దేవాలయ అర్చకులు శ్రీనివాసులు, నంద్యాల పట్టణంలోని బ్రహ్మానందీశ్వర స్వామి దేవాలయ అర్చకులు రాచకొండ మురళీకృష్ణ శర్మ, నొస్సం గ్రామ బుగ్గ వెంకటేశ్వర రామలింగేశ్వర స్వామి దేవాలయ అర్చకులు పెట్టిన కోట శ్రీకాంత్‌ శర్మలకు రూ.10,116ల పారితోషికం, ప్రశంసా పత్రం, కండువాలను జిల్లా కలెక్టర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ తదితరులు అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి, ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో డిఎంహెచ్‌ఒ వెంకటరమణ, మున్సిపల్‌ కమిషనర్‌ రవిచంద్రారెడ్డి, డిఎస్‌ఒ ఆచార్యులు, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.