ప్రజాశక్తి-యంత్రాంగం : విశాఖ జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు చేశారు.
గీతంలో.. పెదజాలారిపేట, మోదవలసలో గీతం వైద్య, నర్సింగ్ విద్యార్ధులు తల్లిపాల వారోత్సవాలు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లి పాలు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తాయని జిమ్‌సర్ వైద్య కళాశాల ప్రిన్సిల్ డాక్టర్ జ్యోతి పద్మజ పేర్కొన్నారు.
ఆరిలోవ : 13వ వార్డు ఆరిలోవ కాలనీ అంగన్వాడీ భవనంలో పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత మాట్లాడుతూ, తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ మినీషా సుందరి, డాక్టర్ దివ్య సౌజన్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆనందపురం : మండలంలోని వెల్లంకిలో తల్లిపాలు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక ఆరోగ్య అధికారి పి సాంబమూర్తి మాట్లాడుతూ, పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలన్నారు. తల్లి పాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి సర్పంచ్ ఉప్పాడ లక్ష్మణరావు, ఉప సర్పంచ్ కంచరాల శ్రీనివాసరావు, ఎంపీటీసీ పడాల అప్పలనాయుడు, బాలింతలు పాల్గొన్నారు.










