Aug 13,2023 22:32

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
          పనిపట్ల అంకిత భావం, వ్యాపారంలో నాణ్యత, నమ్మకం సమస్త అభివృద్ధికి విజయసంకేతమని, సర్యమిత్ర రజతోత్సవానికి చిహ్నమని సూర్యమిత్ర ఎగ్జిమ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ యిర్రింకి సూర్యారావు అన్నారు. భీమవరంలో సూర్యమిత్ర ఎగ్జిమ్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రెండో పట్టణంలోని ఆనందఇన్‌లో సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా పాలకొల్లు ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు విచ్చేశారు. సూర్యారావు వ్యాపార విధానాలు, నిబద్ధత వల్లే ఆయన వ్యాపార సంస్థ ఈ స్థాయికి వచ్చిందని అభినందించారు. డాక్టర్‌ ఇర్రింకి సూర్యారావు మాట్లాడుతూ 25 వసంతాలు పూర్తి చేసుకున్న తమ సంస్థకు సహకరించిన ఆక్వా రైతులకు, హేచరీస్‌ వారికి, కంపెనీ సిబ్బందికి, కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులందరికీ అభినందనలు తెలిపారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని, 1998లో ప్రారంభించినప్పుడు సంస్థ చిన్న స్థాయి నుంచి దినదిన అభివృద్ధి చెందిందన్నారు. ప్రస్తుతం కొన్ని వేల కుటుంబాలు సూర్యమిత్ర సంస్థపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయన్నారు. వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కూడా కంపెనీ అందిస్తుందన్నారు. భారతదేశంలోనే టాప్‌ టెన్‌లో ఉన్న సంస్థ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. సంస్థ సిఇఒ ఇర్రింకి గంగారామ్‌ మాట్లాడుతూ ట్రేడర్‌గా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి నీతి నిజాయితీతో వ్యాపారం నిర్వహిస్తూ, వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తూ ప్రముఖ ఎక్స్‌పోర్ట్‌ సంస్థగా ఎదిగిన సూర్యమిత్ర నేడు భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో ఉందన్నారు. అనంతరం ఆక్వా రైతులు, ట్రేడర్లు, సహా ఎగుమతి దారులు, బ్యాంకర్లు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్‌ సూర్యరావును ఘనంగా సత్కరించారు.
సూర్యారావుకు ఘనసత్కారం
సూర్యమిత్రను అభివృద్ధిలో ముందు తీసుకు వెళ్లడం కాకుండా, తమను కూడా అభివృద్ధి వైపు అడుగులు వేయించిన సూర్యారావును అటు కుటుంబ సభ్యులు, ఇటు సూర్యమిత్ర సిబ్బంది, ట్రేడర్స్‌, ఏజెంట్లు, రైతులు, స్నేహితులు, అభిమానులు, దుశ్శాలువతో పాటు, గజమాల, పూల కిరీటంతో ఘనంగా సత్కరించారు.