ఘనంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు
తిరుచ్చిపై శ్రీ మలయప్ప దర్శనం
ప్రజాశక్తి- తిరుమల
శ్రీవారి నవరాత్రి బ్రహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు ఉదయం బంగారు తిరుచ్చిపై తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. ఆలయ అర్చకులు కంకణందారుడిగా టిటిడి ఈవో ధర్మారెడ్డికి మణికట్టుకు కంకణం ధరించారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహించేలా కటాక్షించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో బోర్డు మెంబర్ సుబ్బరాజు, పారుపత్తేదార్ ఉమామహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుడు
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన ఆదివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు పరమపద వైకుంఠనాథుని అలంకారంలో ఏడుతలల పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు తన పడగనీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు. ఈ వాహన సేవలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, జెఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహకిషోర్ తదితరులు పాల్గొన్నారు.










