Apr 04,2023 22:39

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: చైత్ర మాస బ్రహ్మాత్సవాలలో భాగంగా మూడోరోజు మంగళవారం ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహాోత్సవం వైభవోపేతంగా జరిగింది. మంగళవారం మహా మండపం ఏడో అంతస్తు ధర్మపధము కళావేదిక వద్ద ప్రముఖ కవి పండితులచే శ్రీ స్వామి వారి, అమ్మవార్ల విశిష్టతను తెలియజేస్తూ వైభవంగా ''రాయభారం'' (ఎదుర్కోలు ఉత్సవం) కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమం నందు పాల్గొన్న కవి పండితులను ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌ కర్నాటి రాంబాబు, కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ళ భ్రమరాంబ సత్కరించడం జరిగింది. అనంతరం ధర్మపధం వేదిక నందు మంగళవాయిద్యములు, వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా కల్యాణ మహాోత్సవం నిర్వహించారు. సాయంత్రం మంగళ వాయిద్యములు, కోలాటలు మరియు సాంస్కతిక కార్యక్రమాల నడుమ సింహ వాహనంపై ఆదిదంపతుల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. అలంకరించిన సింహ వాహనం పై శ్రీ గంగా దుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు పూజలు చేశారు. ఆలయంలోని మల్లిఖార్జున మహామండపం నుండి బయలుదేరి కనకదుర్గా నగర్‌, రధం సెంటర్‌, బ్రాహ్మణ వీధి, శ్రీనివాస మహల్‌, కోమల విలాస్‌ సెంటర్‌, సామరంగ చౌక్‌, మెయిన్‌ రోడ్‌, రధం సెంటర్‌ మీదుగా తిరిగి మహామండపానికి సింహ వాహన ఊరేగింపు చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టుబోర్డ్‌ సభ్యులు బచ్చు మాధవీ కష్ణ, బుద్దా రాంబాబు, చింతా సింహాచలం, దేవాదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప పాల్గొన్నారు. దుర్గమ్మను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు దంపతులు దర్శించుకున్నారు. చైత్రమాస బ్రహ్మాోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల కృష్ణవేణి నదీ విహారము నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.