May 15,2023 22:42

ప్రజాశక్తి - భీమడోలు
               గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసి ప్రజలు కరువు బారిన పడకుండా కృషి చేసిన సర్‌ అర్ధర్‌ కాటన్‌ ధన్యజీవి అని జలవనరుల శాఖ గుండుగొలను సెక్షన్‌ సహాయ ఇంజినీర్‌ కె.మాధవరావు, భీమడోలు తహశీల్దార్‌ షంషుద్దీన్‌ తెలిపారు. గుండుగొలను, భీమడోలులోని వారి కార్యాలయాల్లో సోమవారం కాటన్‌ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సహాయ ఇంజినీర్‌ మాధవరావు, తహశీల్దార్‌ కాటన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పట్లో కాటన్‌ చేసిన కృషి ఫలితంగా జిల్లాకు సాగు, తాగునీరు ఇబ్బందులు లేకుండా అందుతున్నాయని తెలిపారు. ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా ప్రతిఒక్కరి గుండెలో ఆయన చిరంజీవిగా నిలిచారన్నారు. జల వనరుల శాఖ సహాయ ఇంజినీర్‌ మాధవరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, తమ శాఖ పరంగా ఏలూరు కాలువలో పూడిక తీత కార్యక్రమం పూర్తయిందన్నారు. ప్రస్తుత సంవత్సరం కాలువలో తూడు తొలగించే కార్యక్ర మాన్ని చేపట్టామన్నారు. దీనిలో భాగంగా పూళ్ల- కైకరం మధ్య ఉన్న మూడో నెంబర్‌ ఎస్కేప్‌ నుంచి ఏలూరులోని తూర్పులాకుల వరకు ఉన్న ఏలూరు కాలువలో తూడు తొలగింపు రూ.15 లక్షలు, ఆగడాలలంక ఛానల్‌తో పాటు, పలు ఇతర బ్రాంచి చానల్స్‌లో తూడు తొలగింపునకు రూ. తొమ్మిది లక్షలు మంజూరయ్యాయన్నారు. టెండర్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో భీమడోలు ఎంపిడిఒ. డి.సత్యనారాయణ, వ్యవసాయ అధికారి ఉషారాణి, గుండుగొలను ఇరిగేషన్‌ కార్యాలయ సహాయకులు సత్యనారాయణ, బాబురావు పాల్గొన్నారు.
కలిదిండి : వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా స్థానిక శాఖా గ్రంథాలయంలో గోదావరి డెల్టా పితామహుడు సర్‌ ఆర్ధర్‌ కాటన్‌ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మాణంలో ఆయన చేసిన కృషిని విద్యార్థులకు వివరించారు. అనంతరం స్పోకెన్‌ ఇంగ్లీష్‌ తరగతులు నిర్వహించినట్లు శాఖా గ్రంథాలయాధికారి జె.రమేష్‌బాబు తెలిపారు. ఉపాధ్యాయులు డివి.నరేష్‌, షేక్‌ మొహిద్దిన్‌ నాయక్‌ పాల్గొన్నారు.