ప్రజాశక్తి-పాడేరుటౌన్:గడచిన కరోనా విలయ తాండవంతో అంతంతమాత్రంగా జరిగిన పెద్ద పండుగ సంక్రాంతి కోవిడ్ భయాల్ని దాటి ఈ ఏడాది పూర్తిస్థాయిలో జరిగాయి. భోగి, సంక్రాంతి, కనుమగా మూడు రోజులపాటు పండుగను అల్లూరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఏజెన్సీలోని గ్రామాల్లో మూడు రోజులు సంక్రాంతి సంబరాలు సందడిగా సాగాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలు సొంతూళ్లకు చేరు కోవడంతో జిల్లాలోని గిరిజన గ్రామాలు పండుగ శోభతో కళకళలాడాయి. కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో సహపంక్తి భోజనాలు, ముచ్చట్లతో జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ చిన్న పెద్దా ఉల్లాసంగా గడిపారు. గ్రామాల్లో థింసా నృత్యాలతో (గుమ్మలాట) ఆనందంగా గడిపారు. సంక్రాంతి సంబరాల కోసం తరలి వచ్చిన ప్రజానికంతో గ్రామాలన్నీ సందడిగా మారాయి. సంక్రాంతి పండుగకు ముగ్గులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండడంతో మహిళలు తమ ఇళ్ల ముందు రోజుకో ముగ్గును వేస్తూ ముంగిళ్లను అందంగా అలంకరించారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా రావడంతో ఆనందోత్సవాల మధ్య వేడుకలను జరుపుకున్నారు.
'భారీ విజయం' పేరుతో ఉత్సవాలు
ప్రజాశక్తి-పాడేరు: పాడేరు ఏజెన్సీలో గిరిజన సంస్కతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలతో సంక్రాంతి సంబరాలు వినూత్నంగా సాగుతుంటాయి. మైదాన ప్రాంతాల్లో సంక్రాంతిని పురస్కరించుకొని వీధివీధిన తీర్థాలు నిర్వహిస్తుంటారు. ఏజెన్సీలో అందుకు భిన్నంగా భారీ విజయం పేరుతో గ్రామాల్లో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఊరంతా సంక్రాంతిని తలపించే రీతిలో పిల్లల నుంచి యువకులు, మహిళలు, పెద్దల వరకు విచిత్ర వేషధారణలతో అందర్నీ సంతోషంగా ఉల్లాస పరిచే రీతిలో ఈ భారీ విజయం ఉత్సవాలు జరుగుతుంటాయి. అన్నదమ్ములు, బావమరుదులు ఒక వైపునా, అక్క చెల్లెలు, వదిన మరదళ్ళు మరోవైపున బడ్డు లాగుతూ బలాబలాలను ప్రదర్శిస్తూ ఉల్లాసంగా భారీ విజయాన్ని జరుపుతుంటారు. ఈ భారీ విజయం రానున్న వారం రోజుల పాటు అనేక గ్రామాల్లో గిరిజనులు తన సాంప్రదాయంగా సంక్రాంతిని పురస్కరించి జరుపుకుంటుంటారు. వృద్ధులు సైతం విచిత్ర వేషధారణలతో ప్రదర్శనలు ఇస్తుంటారు. మహిళలు, యువకులు థింసా నృత్యాలతో ఉల్లాసంగా ఆడి పాడి ఆనందతాండవం చేస్తుంటారు. ఈ నృత్య ప్రదర్శనలు, పిల్లల వేషాలు అమితంగా ఆకట్టుకుంటాయి. పాడేరు సమీపంలోని లింగాపుట్టు, డోకులూరు, మినుములూరు, పాత పాడేరు, తామరపల్లి, డంపరాయి తదితర ప్రాంతాల్లో ఈ భారీ విజయం ఉత్సవాలు పెద్ద ఎత్తును నిర్వహిస్తారు.










