ప్రజాశక్తి -కంచరపాలెం : సిపిఐ 98వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ ఉత్తర నియోజకవర్గ సమితి ఆధ్వర్యాన కంచరపాలెం ముత్యాలమ్మ గుడి జంక్షన్ నుంచి కప్పరాడ నేషనల్ హైవే సర్వీస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పార్టీ పతాకాన్ని జీవీఎంసీ సిపిఐ ఫ్లోర్ లీడర్ ఎజె.స్టాలిన్ ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, విద్యార్థులు, రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు తదితర అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం సిపిఐ పోరాడుతోందనానరు. ఆర్‌ఎస్‌ఎస్ కన్నుసన్నల్లో నడుస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కులం, మతం పేరుతో దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఇటువంటి దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, టిడ్కో గృహాలను స్థానికులకే కేటాయించాలని, అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, కుంటి సాకులతో తొలగించిన రేషన్ కార్డులను, పెన్షన్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ.విమల, ఎస్‌కె.రెహమాన్, ఆర్.శ్రీనివాసరావు, వి.నల్లయ్య, నాగభూషణం, నూకాలమ్మ, ఆడారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.










