ప్రజాశక్తి - జంగారెడ్డి గూడెం
సిఎస్‌టిఎస్ ప్రభుత్వ కళాశాల నిర్మించి 49 సంవత్సరాలు పూరైన సందర్భంగా 2023-24 సంవత్సరాన్ని స్వర్ణోత్సవ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.ప్రసాద్ బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక చత్రపతి శివాజీ జయంతి, కళాశాల స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని, కళాశాల స్థాపించి 50వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్.ప్రసాద్ బాబు సమక్షంలో 2023-24 సంవత్సరాన్ని స్వర్ణోత్సవ సంవత్సరంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జరిగే కార్యక్రమాలన్నీ స్వర్ణోత్సవాల్లో భాగమేనన్నారు. దాత ఈ కళాశాల స్థాపించారని గుర్తు చేశారు. కళాశాల పేరు ప్రఖ్యాతలను నిలబెట్టడం ఇక్కడున్న అందరి బాధ్యతని, దానికి విద్యార్థులు సహాయ సహకారాలు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కళాశాల సిపిడిసి సెక్రెటరీ మొగళ్లపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థులందరూ చదువుకొని మూర్తి రాజు ఆశయం నిలబెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ వైఎస్ వి.శేషగిరి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ బి.శ్రీనివాస్ రావు, ఐక్యుఎసి కోఆర్డినేటర్ డా.ఎం.మధు, కల్చరల్ కమిటీ కోఆర్డినేటర్ సిహెచ్.రమాదేవి, కల్చరల్ కమిటీ మెంబర్స్ డా.జివి.లాల్, పిఎస్.రావు, వి.హనుమంతరావు, కెవివి శిరీష, ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.










