Feb 28,2023 21:59

ప్రజాశక్తి - ఏలూరు
        స్థానిక పడమర వీధిలోని లిటిల్‌బడ్స్‌ స్కూల్లో సైన్స్‌ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన సైన్స్‌ నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వీరిలో కొందరు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. ఉపాధ్యాయులు సైన్స్‌ ప్రాధాన్యత గురించి, శాస్త్రవేత్తల గురించి, వారు సాధించిన నోబెల్‌ బహుమతుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ డైరెక్టర్స్‌, ఇన్‌ఛార్జిలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా ఏలూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సెట్‌వెల్‌ జిల్లా కార్యాలయం వారు సంయుక్తంగా కళాశాల విద్యార్థులకు క్విజ్‌ పోటీలు, వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు డాక్టర్‌ గుత్తా గిరిబాబు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్‌పట్ల అవగాహన కలిగి మంచి ఆవిష్కరణలు చేసే దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. ముఖ్యఅతిథిగా సెట్‌వెల్‌ సిఇఒ ఎమ్‌డి.మెహర్రాజ్‌ మాట్లాడుతూ నిత్యజీవితంలో జరిగే సంఘటనలను వైజ్ఞానిక దృక్పథంతో చూడడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ప్రిన్సిపల్‌ కె.అజరుకుమార్‌, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
ముసునూరు:ప్రతీవిద్యార్థి విజ్ఞానవంతులు కావాలని ఎంపిడిఒ జి.రాణీ అన్నారు. మండలంలోని ముసునూరు భారత్‌ విద్యానికేతన్‌ పాఠశాలలో ప్రిన్స్‌పల్‌ కొండేటి శౌరి ఆధ్వర్యంలో సివి.రామన్‌ పుట్టిన రోజు సందర్భంగా జాతీయ సైన్సు దినోత్సవం ఘనంగా నిర్వహించారు. లోపూడి ఆశ్చర్య ఇంగ్లీషు మీడయం పాఠశాలలో రూపొందించిన చీకటి నుండి వెలుతురులోకి నడిపించిన మన జీవిత విదానంపై ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. చక్కపల్లిలో శ్రీ చైతన్య ఇంగ్లీషు మీడియం స్కూల్లో ప్రిన్స్‌పల్‌ మరీదు నాగరాజు ఆధ్వర్యంలో సివి.రామన్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు.
మండవల్లి : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక నైపుణ్యాలను వెలికి తీయడానికి వైజ్ఞానిక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని తహశీల్దార్‌ జనార్థన్‌రావు ఎంపిడిఒ పి.మల్లేశ్వరి పేర్కొన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సుధామ ఫౌండేషన్‌ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సంయుక్తంగా ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంగళవారం బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచి ఎం.జాన్సీ, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరావు, టి.అప్పారావు, కె.సూర్యారావు, ప్రధానోపాధ్యాయులు జి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు ఆర్‌విఎల్‌.నరసింహారావు, శ్యాం, రఘురాం, గ్రంథాలయ అధికారి షేక్‌ పర్వీన్‌ పాల్గొన్నారు.
చింతలపూడి :స్థానిక జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాలలో సైన్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సిఐ మల్లేశ్వరరావు, ఎంపిపి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సైన్స్‌ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆగిరిపల్లి : సైన్స్‌ దినోత్సవం ఆగిరిపల్లి జెడ్‌పి హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన వర్కింగ్‌ మోడల్స్‌, హైడ్రాలిక్‌ బ్రిడ్జ్‌ ఓపెనింగ్‌ వైజ్ఞానిక నమూనాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి.పుష్పలత మాట్లా డుతూ విద్యార్థులు సైన్స్‌ పట్ల మక్కువ పెంచుకోవడంతో పాటు నూతన ఆవిష్క రణలపై దృష్టిసారించాలన్నారు. ఈ కార్య క్రమంలో ఉపాధ్యాయులు విజరు కుమార్‌, కృప, అనురాధ విద్యార్ధులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం:స్థానిక వికాస్‌ విద్యాసంస్థల్లో సైన్స్‌ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వికాస్‌లో సైన్స్‌ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వికాస్‌ డైరెక్టర్‌ జగన్నాథరావు (జగన్‌) మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు తమ విద్యాసంస్థలు ఎప్పుడూ ముందుంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్‌ విద్యాసంస్థల డీన్‌ సత్యనారాయణ, ఎఒ మోహన్‌రావు, ఎజి ఎం.సురేష్‌, ప్రిన్సిపల్‌ దేవిశ్రీ, ఉపాధ్యాయ, అధ్యాపక, సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఉంగుటూరు : నారాయణపురంలోని శ్రీఅరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సైన్స్‌ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు రూపొందించిన సైన్స్‌ ప్రయోగాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విశ్వేశ్వరరావు మాట్లాడారు.