ప్రజాశక్తి-అరకులోయ రూరల్: అరకువేలి శారద నికేతన్ పాఠశాలలో శనివారం డి.శారద 18వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ చిరంజీవులు, హిందీ టీచర్ టి.కృష్ణకుమారి, సిబ్బంది శారద చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాల వైస్ ప్రిన్సిపల్ చిరంజీవి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదువు అందించాలనే ఉద్దేశంతో శారదా కళల మేరకు శారదా ట్రస్ట్ పేరుతో మన పాఠశాల స్థాపించడం విశేషమన్నారు. శారద కష్టజీవులు, మహిళల హక్కుల కోసం గిరిజన ప్రాంతంలో సేవలందించారన్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టజీవుల తరఫున సుదీర్ఘమైన పోరాటం నిర్వహించారని చెప్పారు. గిరిజన ప్రాంతంలో మంచినీరు, తదితర సమస్యలపై పోరాటం చేశారని గుర్తు చేశారు. ఏజెన్సీలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి మందులు పంపిణీ చేశాని చెప్పారు. శారద ట్రస్ట్ పేరుతో మారుమూల గ్రామాలకు తాగు నీరు సరఫరా చేస్తున్నారన్నారు. ఆర్ధిక సామాజిక, సాంఘిక అసమానతలు రూపుమాపాలని అనేక పోరాటాలు నడిపారాని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శారద స్కూల్ ఉపాధ్యాయులు విజరు, నాగలక్ష్మి, జగన్నాథం. బాబురావు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలో శారద నికేతన్ ఇంగ్లీష్ మీడియంలో శ్రామిక మహిళా ఉద్యమ నేత డి.శారద 18వ వర్ధంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో శారద చిత్ర పటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి నివాళు అర్పించారు. శారద చేసిన త్యాగాలు, పేదల పట్ల సేవలు గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల కేంద్రంలో శారద ట్రస్ట్ ఆధ్వర్యంలో శారద నికేతన్ పాఠశాల నడపడానికి ఆమె త్యాగ ఫలితమేనన్నారు. ఆమె జ్ఞాపకార్థంగా గతంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, అవగాహన సదస్సు, బాల్య వివాహాలపై అవగాహన, మహిళలకు ప్రత్యేక చట్టాలు, హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యరాజు, దొన్ను, ఉషారాణి, రత్నకుమారి, ఝాన్సీ, సుస్మిత, సంగీత, ప్రకాష్, సుందరమ్మ, గౌరి పాల్గొన్నారు.










