Jul 05,2023 01:26
రోశయ్య విగ్రహావిష్కరణలో కెవిపి, కరణం తదితరులు

ప్రజాశక్తి-చీరాల: ఉమ్మడి రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు, తమిళనాడు మాజీ గవర్నర్‌, తెలుగు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అని ఎమ్మెల్యే కరణం బలరామకష్ణమూర్తి అన్నారు. మంగళవారం రోశయ్య జన్మదినోత్సవం సందర్భంగా ఎంజిసి క్లాత్‌ మార్కెట్‌ వద్ద చీరాల పురపాలక సంఘం నిధులతో రోశయ్య విగ్రహ ఆవిష్కరణ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌ బాబు, ముఖ్యఅతిథిగా రోశయ్య కుమారుడు శివ సుబ్బారావు ఆయన కుటుంబ సభ్యులు హాజరై రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతూ దేశ చరిత్రలోనే తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో ఆనాడు జరిగిన అసెంబ్లీ సమావేశాలలో రూ.లక్ష కోట్లతో 16 సార్లు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత కేవలం కొణిజేటి రోశయ్యకే దక్కుతుందని అన్నారు. రాజకీయాలలో అంచెలంచలుగా ఎదుగుతూ అందరి మన్నలతో ఆర్థిక శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా ఆయన అందించిన సేవలు అనేకమని అన్నారు. చీరాలలోని ఎంజిసి క్లాత్‌ మార్కెట్‌కు ప్రత్యేక స్థానం కల్పించిన వ్యక్తి రోశయ్య అన్నారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని చీరాలలో ఆవిష్కరించటం అభినందనీయమని అన్నారు. అనంతరం రోశయ్య కుటుంబ సభ్యులను సత్కరించారు. మున్సిపల్‌ చైర్మన్‌ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైస్‌ చైర్మన్‌ బోనిగల జైసన్‌ బాబు, కౌన్సిలర్లు మామిడాల రాములు, ఉల్లిపాయల సుబ్బయ్య, గుంటూరు ప్రభాకర్‌రావు బాలకష్ణ, గోలి స్వాతి, సుధ, మల్లెల రాజశేఖర్‌, శివ నారాయణమూర్తి, టిటిఎంఏ ప్రతినిధులు, ఆహ్వాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు.