ప్రజాశక్తి-బాపట్ల: ముస్లిములు రంజాన్ పండుగ వేడుకలను శనివారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పట్టణంలోని ఇస్లాంపేట, జమేదార్ పేట ఈద్గాల్లో ఈద్ ప్రార్థనలు నిర్వహించారు. హిందువులు, ముస్లిములు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకొని మిఠాయిలు పంచుకున్నారు. ఈద్గాల్లో నమాజ్ ఏర్పాట్లను బాపట్ల అంజిమన్ ఎ ఇస్లామియా కమిటీ పర్యవేక్షించింది.
పంగులూరు: రంజాన్ పండుగను ముస్లింలు పంగులూరు మండలంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పంగులూరు, అలవలపాడు, రామకూరు, చిన్న మల్లవరం గ్రామాల్లో ముస్లింలు ఉదయం 9 గంటలకల్లా ఈద్గాల దగ్గరికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పంగులూరులోని మండల పరిషత్ కార్యాలయం వెనుక ఉన్న 50 సెంట్ల స్థలాన్ని వైసీపీ అద్దంకి నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్య ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ముస్లింలకు కేటాయించటంతో ఈ సంవత్సరం రంజాన్ ప్రార్థనలు అక్కడ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లింలు కృష్ణ చైతన్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇమామ్ అబూబకర్ సిద్ధిక్ మాట్లాడుతూ, రంజాన్ పండుగను ప్రేమ, త్యాగం, అనుబంధాలకు మారుపేరుగా ముస్లిములు జరుపుకోవాలని అన్నారు. పేదల పట్ల ఆప్యాయత, అనురాగం నిండి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ముస్లిం యువకులందరూ ఒకరినొకరు ఆ లింగం చేసుకుని, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
అద్దంకి: రంజాన్ పండుగను ముస్లిములు భక్తిశ్రద్ధలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా అద్దంకి పట్టణంలో భవాని సెంటర్, సింగరకొండ రోడ్డు, మేదరమెట్ల రోడ్డులోని ఈద్గాల వద్ద ముస్లిములు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు. రంజాన్ పండుగను పాటించే గృహాలలో నెల రోజులు కఠోర ఉపవాస దీక్షల తరువాత ఈ ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. మండలంలోని మణికేశ్వరం గ్రామంలో ఎస్‌కె కరీముల్లా ఆధ్వర్యంలో ముస్లిములు అల్లాను ఆరాధిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అల్లాహు రక్షణ కరుణ పొందాలని లక్ష్యంతో ఈ రంజాన్ పండుగ దిన ప్రత్యేక ప్రార్థనలు జరుపుకుంటామని మతపెద్దలు వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పిత్రా మరియు జకాత్ రూపంలో ఉన్నదానిలో ఎంతో కొంత దానధర్మాలు చేస్తారన్నారు. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని ముస్లిములు భారీ సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు.
భట్టిప్రోలు: పవిత్ర రంజాన్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. అద్దేపల్లి పెద్ద మజీద్‌లో ముగింపు ఉపవాస దీక్షలలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కో ఆప్షన్ సభ్యులు షేక్ సలీమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని మసీదు ఇమామ్, మౌజన్‌లకు మంత్రి నూతన వస్త్రాలను బహూకరించారు. ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీనిచ్చారు. షాదీఖానాకు రూ.15 లక్షలు నిధులు కేటాయిస్తానన్నారు. అనంతరం మతపెద్దలు నాగార్జునను సత్కరించారు.
సంతమాగులూరు: మండలంలోని కొమ్మాలపాడు, ఏల్చూరు, సంతమాగులూరు, వెల్లలచెరువు, కొప్పరం, గ్రామాలలో రంజాన్ పర్వదినాన్ని ముస్లిములు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలువురు ప్రజా ప్రతినిధులు ముస్లిములకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా మసీదుల వద్ద పేదలకు దానధర్మాలు చేశారు. ప్రార్థన అనంతరం ఎస్‌ఐ ఎంవి శివకుమార్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ శివకుమార్ ముస్లిములకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంకొల్లు రూరల్: రంజాన్ పండుగను ముస్లిములు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద సామూహిక ప్రార్థనలు జరుపుకున్నారు. అక్సా మసీదు, మక్కా మసీదుల్లో ఉదయాన్నే పండుగ ప్రార్థనలు జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం దాహెరా (శ్మశాన వాటిక) వద్ద తమ పూర్వీకుల పవిత్ర ఆత్మ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
మార్టూరు రూరల్: ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగను మార్టూరు, బొబ్బేపల్లి, ద్రోణాదుల, చిమ్మిరిబండ, వలపర్ల గ్రామాలలో వేడుకగా నిర్వహిం చారు. శనివారం ఉదయం నుంచే పరస్పర అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈద్గాల వద్ద మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మార్టూరు వ్యవసాయ యార్డులో పెద్ద సంఖ్యలో ముస్లిములు ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్టూరుకు చెందిన గడ్డం మస్తాన్‌వలి ఇటీవల బాపట్ల జిల్లా వక్ఫ్ బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మార్కెట్ యార్డ్‌లో స్థానిక ముస్లిం నాయకులు, మతపెద్దలు ఘనంగా సన్మానించారు.
రేపల్లె: రంజాన్ పర్వదిన వేడుకలు పట్టణంలో ముస్లిము లు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు నేటితో విరమించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం అయిన నాటి నుంచి ఖురాన్ గ్రంథ పారాయణం చేస్తూ, పేదలు, అవసరతలో ఉన్నవారికి దానధర్మాలు చేస్తూ శనివారం రోజు రంజాన్ పండుగను జరుపుకున్నారు. ముస్లిములు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకు న్నారు. అల్లా నామస్మరణ చేస్తూ పట్టణంలోని ఉయ్యూరు వారిపాలెం రోడ్డులో ఉన్న ఈద్గా వద్దకు చేరుకుని రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఈద్గా కమిటీ ప్రెసిడెంట్ షేక్ జమీర్, మొహిద్దీన్, బుడా చైర్మన్ దేవినేని మల్లికార్జున రావు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.
బల్లికురవ రూరల్: రంజాన్ పర్వదిన వేడుకలు మండలంలోని అన్ని గ్రామాల్లో ముస్లిములు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గత నెల రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలను విరమించారు. అల్లా నామస్మరణ చేస్తూ మండలంలోని బల్లికురవ, గుంటుపల్లి, వల్లాపల్లి, కొమ్మినేనివారిపాలెం, వైదన, కొప్పెరపాడు, ముక్తేశ్వరం, చెన్నుపల్లి, కొనిదెన గ్రామాల్లో ఈద్గా మసీదుల వద్దకు చేరుకుని రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.










