Sep 09,2022 00:55

నాటకంలోని ఓ సన్నివేశం

ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ : కీర్తిశేషులు గరికపాటి రాజారావు 59వ వర్థంతిని పురస్కరించుకొని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో స్థానిక కళాభారతి ఆడిటోరియంలో రెండో రోజైన గురువారమూ రంగస్థల నాటకోత్సవాలు ఘనంగా సాగాయి. చివరి రోజు వీక్షకులు పెద్ద సంఖ్యలో హాజయ్యారు. అనంతరం మన పాటలు పాటల పుస్తకంలో మొదట భాగం దేశభక్తి -అభ్యుదయ గీతాలు, రెండో భాగం జనం పాటలు, మూడో భాగం ఎర్ర జెండా, అమరవీరులు, రాజకీయ చైతన్య గీతాలు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఎన్‌ఎం రాష్ట్ర బాధ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ పాట ప్రపంచ ప్రఖ్యాతిగాంచినదని అన్నారు. శ్రీశ్రీ రచనలు ఎలా ప్రభవించాయో వివరించారు. 700 పాటలుగల ఈ పుస్తకాలను ప్రజాశక్తి వారు ఆర్థిక భారం మోసి ముద్రించారని అన్నారు. శ్రీశ్రీ, రావి శాస్త్రి పెద్ద ఉపన్యాసకులు కాదని, కానీ వారి రచనలు, కవితలు మాత్రం ఎంతో పదునైనవని అన్నారు. ఇప్పటి సినిమాల్లోని పాటల్లో అసభ్య పదజాలం పెరిగిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిఎన్‌ఎం రాష్ట్ర అధ్యక్షులు మంగరాజు మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కోసం గరికపాటి రాజారావు చేసిన కృషి మరువలేనిదన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన చేసిన రచనలు మా భూమి, ముందడుగు, పోతుగెడ్డ వంటివి ఎంతో ప్రభావం చూపాయని అన్నారు. ఎంతో మంది మహా నటులను చిత్ర రంగానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తన కళా రూపాల ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్లిన వ్యక్తి గరికపాటి అని కొనియాడారు. కరోనా కాలంలో కళాకారులను ప్రభుత్వాలు గాలికొదిలేసాయన్నారు. అటువంటి తరుణంలో ప్రజలే ఆదుకున్నారని తెలిపారు. సంఘం జిల్లా కార్యదర్శి ఎం.చంటి మాట్లాడుతూ కార్మికులు చేస్తున్న పోరాటాల్లో ప్రజానాట్యమండలి ముందుంటుందని, తాము తమ శక్తి మేరకు కళలను ప్రజల మధ్యకు తీసుకు వెళుతున్నామని అన్నారు. అనంతరం నగరానికి చెందిన భద్రం ఫౌండేషన్‌ కళాకారులు 'కలిసుంటే' నాటికను ప్రదర్శించారు. నాటిక ఆధ్యంతం హాస్యభరితంగానూ, సందేశాత్మకంగానూ సాగింది.
పలువురికి సత్కారం
పాటల రచయితలైన నల్లి ధర్మారావు, కొర్ర గోవర్థన్‌, మౌలాలి, పద్మ, రెడ్డి శంకరరావు, ఐ.వెంకటేశ్వరరావు, మంగరాజులను వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం పూర్వ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షులు జి.రమణ పాల్గొన్నారు.