ప్రజాశక్తి- ములగాడ : ప్రజల మనిషి, సిపిఎం మల్కాపురం జోన్ నాయకులు కీర్తిశేషులు ధర్మిరెడ్డి రామునాయుడు రెండో వర్థంతిని 62వ వార్డు పరిధి దుర్గానగర్ గ్రౌండ్ ఆవరణలో నిర్వహించారు. సిపిఎం మల్కాపురంజోన్ నాయకులు కె.పెంటారావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి మరడాన జగ్గునాయుడు, 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు రామునాయుడు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ, రామునాయుడు సిపిఎం ఆశయాలకు కట్టుబడి పనిచేసి ప్రజలమనిషిగా గుర్తింపు పొందారన్నారు. వారి కుటుంబానికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, రామునాయుడు ధన్యజీవి అన్నారు. దుర్గానగర్ గ్రామ అధ్యక్షులుగా పదేళ్లపాటు ప్రజలకు ఏనలేని సేవలందించారని, ఇల్లు లేని పేదలకోసం పొరాడి జైలు జీవితం అనుభవించారని తెలిపారు. ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, విద్యుత్, రోడ్లు సమస్యపై నిరంతం పనిచేశారని గుర్తుచేశారు. అవినీతికి తావులేకుండా, నిస్వార్ధంగా పనిచేయడంతో ప్రజల మనస్సులో ధన్యజీవిగా నిలిచారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రామునాయుడు స్ఫూర్తితో పొరాడాలని పిలుపునిచ్చారు. ఈ వర్థంతి సభలో రామునాయుడు కుమారుడు శ్రీను, కోడలు సత్యవేణి, మనవడు యువకిషోర్, సిపిఎం మాల్కాపురంజోన్ కార్యదర్శి పి.పైడిరాజు, దుర్గానగర్ గ్రామ ప్రెసిడెంట్ బగాది మల్లేశ్వరరావు, గ్రామ పెద్దలు నక్కా సూర్యనారాయణ, అచ్చి శ్రీనివాసరెడ్డి, మెట్ట చిన్నారావు, యూత్ అధ్యక్ష కార్యదర్శులు నడిగట్ల సంతోష్, దాట్ల మహేష్, ఐద్వా జోన్ కార్యదర్శి ఆర్.విమల, పి.వరలక్ష్మి, ఏరియా శాఖ కార్యదర్శి బి.అర్జునరావు, సభ్యులు గణేష్, ఆనంద్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.










